న్యూఢిల్లీ/ లక్నో : బాలీవుడ్ చిత్రం పద్మావతి మేకర్లకు పెద్ద ఊరట లభించింది. చిత్ర విడుదలను నిలుపుదల చేయాలంటూ దాఖలైన రెండు వేర్వేరు పిటిషన్‌లను సుప్రీం కోర్టు, అలహాబాద్ హైకోర్టులు కొట్టివేశాయి.
దర్శకుడు బన్సాలీ చరిత్రను వక్రీకరించారని.. కాబట్టి విడుదలను అడ్డుకోవాలంటూ సిద్దారాజ్‌సిన్హ్ ఎం ఛుదాసామ, మరో 11 మంది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, ఏఎం ఖన్విల్‌కర్, డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ విషయంలో సెన్సార్ బోర్డు అన్ని కోణాలను పరిశీలించాకే సర్టిఫికెట్ ఇస్తుందన్న నమ్మకం వ్యక్తం చేస్తున్నట్లు బెంచ్ ప్రకటించింది.
ఇక చిత్రం విడుదల కాకముందే అందులో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయేమోనన్న అనుమానంతో కొందరు అలహాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే అందులోని వాదనలను తోసిపుచ్చిన కోర్టు.. ఈ వివాదాన్ని సంబంధించి విభాగం వద్దే తేల్చుకోవాలంటూ పిటిషనర్‌కు సూచించింది.
కాగా, రాణి పద్మిణి-అల్లావుద్దీన్ ఖిల్జీల మధ్య రొమాంటిక్ ఎపిసోడ్ చిత్రీకరించాడంటూ ఈ చిత్ర దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీపై శ్రీ రాజ్‌పుత్ కర్ణి సేన మొదటి నుంచి తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. చిత్రాన్ని ముందు తమకు ప్రదర్శించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో పలువురు రాజకీయ ప్రముఖులు కూడా ఆందోళనకారులకు మద్దతు ప్రకటిస్తూ వస్తున్నారు. రాజస్థాన్ ప్రభుత్వం ఈ వివాదంపై ఏకంగా ఓ కమిటీని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైపోయింది.
బన్సాలీకి నిధులెక్కడివి? : స్వామి
కాగా, పద్మావతి చిత్ర వివాదంపై బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి తనదైన శైలిలో స్పందించారు. ఈ చిత్ర దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీకి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో దర్యాప్తు చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. దుబాయ్ నుంచి నిధులతో హిందూ మహిళలను అవమానించేలా బన్సాలీ చిత్రాలు తీస్తున్నారంటూ స్వామి తీవ్ర ఆరోపణలు చేశారు. దుబాయ్ ప్రజలు వాళ్ల మతానికి చెందిన రాజులను గొప్పగా చూడాలని అనుకుంటున్నారని.. అందుకే ఇక్కడి మేకర్లకు నిధులు సమకూరుస్తూ సినిమాలు తీయించుకుంటున్నారంటూ విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment