
సితార.. సినిమా ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. సూపర్‌స్టార్ మహేష్ కూతురుగా అందరికి సుపరిచితురాలైన లిటిల్ క్వీన్ సితార చిన్నతనంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటుంది. తన టాలెంట్‌తో ఇప్పటికే స్టార్ అవుతున్న బేబీ సితార డిస్నీ సంస్థ తరఫున తెలుగులో వస్తున్న మూవీ ఫ్రాజెన్-2కు గొంతును అందిస్తున్న విషయం తెలిసిందే. అలాగే బాహుబలి-2 సినిమాలోని ‘కన్నా నిదురించరా.. నా కన్నా నిదురించరా’..పాటకు స్టెప్పులేసిన సితార తాజాగా తండ్రి నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలోని పాటకు చిందులు వేసింది. ‘‘హి ఈజ్ సో క్యూట్’’ అంటూ తన చిన్ని చిన్ని స్టేప్పులతో పాటను అదరగొట్టింది. ఈ పాటలోని సితార స్టెప్పులు మహేష్‌బాబు అభిమానుల చేత అదుర్స్ అనిపిస్తున్నాయి.
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. కమర్షియల్ ఎంటర్‌టైనర్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న మహేష్‌కు జోడిగా నటిస్తోంది. దిల్ రాజు, అనిల్ సుంకరలతో కలిసి మహేష్ స్వయంగా నిర్మిస్తున్నఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన మూడు పాటలు సూపర్ టాక్ సంపాదిస్తుండగా.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయనున్నారు.