పాతికేళ్ల కల నెరవేరింది | SJ Surya Talk About His Marriage | Sakshi
Sakshi News home page

పాతికేళ్ల కల నెరవేరింది

May 21 2019 7:10 AM | Updated on May 21 2019 7:10 AM

SJ Surya Talk About His Marriage - Sakshi

చెన్నై :  నటుడిగా జయించాలన్న తన పాతికేళ్ల కల నెరవేరిందని నటుడు, దర్శకుడు ఎస్‌జే.సూర్య అన్నారు. అజిత్‌ కథానాయకుడిగా నటించిన వాలి చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన ఈయన ఆ తరువాత విజయ్‌ కథానాయకుడిగా ఖుషీ చిత్రం చేశారు. ఈ రెండు విజయాలతో సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించారు. అంతే కాదు తెలుగులోనూ పవన్‌కల్యాణ్‌ హీరోగా ఖుషీ చిత్రం చేసి సక్సెస్‌ అయిన ఎస్‌జే సూర్య ఆ తరువాత హీరోగా అవతారమెత్తారు. అలా నటుడుగా, దర్శకుడిగా రెండు పడవలపైన పయనిస్తూ ఇటీవల సరైన సక్సెస్‌ను అందుకోలేకపోయారు. అయితే తాజాగా ఎస్‌జే సూర్య కథానాయకుడిగా నటించిన మాన్‌స్టర్‌ చిత్రం ఇటీవల తెరపైకి వచ్చి విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా థ్యాంక్స్‌ చెప్పడానికి ఎస్‌జే సూర్య సోమవారం మధ్యాహ్నం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాలితో ఆరంభం అయిన తన సినీ పయనం మాన్‌స్టర్‌లో ఆగదన్నారు. తాను మంచి చేసినప్పుడు ప్రశంసించిన పాత్రికేయులు, తప్పు చేసినప్పుడు దాన్ని ఎత్తి చూపించి తాను ఈ స్థాయికి రావడానికి కారణంగా నిలిచారని, అలాంటి వారితో చిత్ర విజయాన్ని పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. సహాయ దర్శకుడిగా పని చేసిన కాలంలో రూ.50 ఇచ్చి స్టూడియోలోపలికి వెళ్లి షూటింగ్‌ చూసిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. ఆదివారం మాన్‌స్టర్‌ చిత్రాన్ని ప్రేక్షకుల మధ్య ధియేటర్‌లో చూశానన్నారు. అప్పుడు ఇరైవి చిత్ర బృందం, నటుడు బాబీసింహా కుటుంబంతో సహా వచ్చి చిత్రాన్ని చూశారని తెలిపారు. ఆయన పిల్లలు చిత్రంలోని ఎలుక సన్నివేశాలను చూసి ఆనందంతో చప్పట్లు కొడుతుంటే తనకు చాలా సంతోషం కలిగిందన్నారు.

హీరోగా విజయం సాధించాలన్న తన పాతికేళ్ల కల ఇప్పటికి నెరవేరిందన్నారు. పాటలు, రొమాన్స్‌ సన్నివేశాలు లేకపోవడమే చిత్ర  విజయానికి కారణమన్నారు. ఇకపై ఈ పయనాన్ని కొనసాగిస్తూ మంచి చిత్రాలు చేస్తానని చెప్పారు. నటుడిగా శ్రమించడమే తన పని అన్నారు. అవకాశాలు రాకపోతే తానే కథలను తయారు చేసుకుని నటిస్తానని చెప్పారు. జీవితంలో అపజయాలు అన్నీ నేర్పిస్తాయని అన్నారు. నటుడు అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి నటించడం చాలా మంచి అనుభవంగా పేర్కొన్నారు. ఆయన ఏ సన్నివేశాన్నైనా సింగిల్‌ టేక్‌లో పూర్తి చేస్తారని, ప్రతి చిత్రాన్ని మొదటి చిత్రంగా భావించడమే అందుకు కారణం అనీ పేర్కొన్నారు. తాను సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో నటించిన నెంజమ్‌ మరప్పదిలై, మాయ చిత్రం ఫేమ్‌ దర్శకుడుతో చేసిన ఇరవా కాలం చిత్రం బాగా వచ్చాయనీ, త్వరలోనే విడుదల కానున్నాయనీ తెలిపారు. తమిళం, తెలుగు, హిందీ చిత్రాల్లో నటించి సక్సెస్‌ అయిన తరువాతనే పెళ్లి గురించి ఆలోచిస్తానని ఎస్‌జే సూర్య అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement