టైటిల్ : ఆపరేషన్ 2019
జానర్ : పొలిటికల్ డ్రామా
తారాగణం : శ్రీకాంత్, దీక్షా పంత్, యగ్న శెట్టి, పోసాని కృష్ణమురళి
సంగీతం : రాప్ రాక్ షకీల్
దర్శకత్వం : కరణం బాబ్జీ
నిర్మాత : అలివేలు
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి కనిపిస్తున్న వేళ సీనియర్ హీరో శ్రీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ఆపరేషన్ 2019. ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఆపరేషన్ దుర్యోధన తరహాలో బోల్డ్‌గా తెరకెక్కించారు. కొంత కాలంగా సరైన హిట్ లేని శ్రీకాంత్ ఈ సినిమాతో తిరిగి ఫాంలోకి రావాలనుకుంటున్నారు. మరి తెలంగాణ ఎన్నికల ముందు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆపరేషన్ 2019 ఏ మేరకు ఆకట్టుకుంది..?
కథ ;
నిరుపేద కుటుంబంలో పుట్టిన ఉమాశంకర్ (శ్రీకాంత్) ఊరి ప్రజల సహకారంతో ఉన్నత చదువులు చదివి ఫారిన్‌లో సెటిల్ అవుతాడు. చిన్నతనంలో ఊరి ప్రెసిడెంట్.. వీలైనంతలో నీ ఊరికో దేశానికో ఉపయోగపడాలని చెప్పిన మాటలు ఉమాశంకర్‌ను సేవా కార్యక్రమాల వైపు నడిపిస్తుంది. తమ ప్రాంతంలోని రైతులు అప్పులు తీర్చలేక ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకొని కోటి రూపాయలను వారికోసం ఆ ప్రాంత ఎమ్మెల్యేకు పంపిస్తాడు. కానీ ఎమ్మెల్యే ఆ డబ్బును రైతులకు అందించకపోవటంతో రైతులు ఆత్మహత్య చేసుకొని చనిపోతారు. ఈ విషయం తెలిసి చలించిపోయిన ఉమాశంకర్ ఇండియా వచ్చి ఆ ఎమ్మెల్యేను ఎదిరిస్తాడు. ఆ ప్రాంత ప్రజల కష్టాలు తీర్చేందుకు తన తరుపున నారాయణ మూర్తి(శివకృష్ణ) అనే సామాజిక వేత్తను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎలక్షన్లలో నిలబెడతాడు. కానీ కులం, మతం పేరుతో ప్రజలు అధికార పార్టీ నాయకుడికే పట్టం కడతారు. ఈ సమస్యకు పరిష్కారం దొరకాలంటే మారాల్సింది నాయకులు కాదు ప్రజలు అని భావించిన ఉమాశంకర్ ఏం చేశాడు..? ప్రజలకు, నాయకులకు ఎలా కనువిప్పు కలిగించాడు? అన్నదే మిగతా కథ.
నటీనటులు :
సినిమా అంతా శ్రీకాంత్ ఒక్కడి చుట్టూనే తిరుగుతుంది. మంచివాడిగా, మూర్ఖుడైన రాజకీయనాయకుడిగా రెండు కోణాల్లోనూ శ్రీకాంత్ నటన బాగుంది. దీక్షాపంత్, శివకృష్ణ, పోసాని కృష్ణమురళి, నాగినీడు తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అయితే ఎవరికీ పెద్దగా స్క్రీన్‌టైం దక్కలేదు. ఇక మంచు మనోజ్, సునీల్‌లు పెద్దగా ప్రాధాన్యం లేని అతిథి పాత్రల్లో కనిపించారు.
విశ్లేషణ :
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో దర్శకుడు కరణం బాబ్జీ మంచి కథను రెడీ చేసుకున్నాడు. ఎన్నికల సమయంలో పరిస్థితులు, గెలిచిన నేతలు పార్టీలు మారటం, అమ్ముడుపోవటం, క్యాంప్ రాజకీయాలు లాంటి అంశాలతో కథ తయారు చేసుకున్నా.. ఆసక్తికరంగా తెరకెక్కించటంలో కాస్త తడబడ్డాడు. కేవలం ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి స్వయంగా అన్ని పర్మిషన్లు ఇచ్చేయటం లాంటి అంశాలు నమ్మశక్యంగా అనిపించవు.
ఫస్ట్ హాఫ్ నెమ్మదిగా సాగుతూ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. ద్వితీయార్థంలో కథనం కాస్త వేగం అందుకుంటుంది. రాజకీయ వ్యూహాలు, ఎత్తులు పై ఎత్తులు ఆకట్టుకున్నా.. ప్రతినాయక పాత్రలు బలంగా లేకపోవటం నిరాశకలిగిస్తుంది. షకీల్ అందించిన సంగీతం పర్వాలేదు. పాటలు పెద్దగా ఆకట్టుకోకపోయినా నేపథ్యం సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ ;
శ్రీకాంత్
సెకండ్‌హాఫ్‌లో కొన్ని సీన్స్
మైనస్ పాయింట్స్ ;
స్లో నేరేషన్
స్క్రీన్‌ప్లే
సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్‌నెట్ డెస్క్.
Comments
Please login to add a commentAdd a comment