అలాంటి అమ్మాయిలు వద్దు బాబూ!
‘‘మా నాన్నగారి జడ్జిమెంట్ మీద నాకు చాలా నమ్మకం. నా గత రెండు చిత్రాలు విజయం సాధించాయంటే ఆయన జడ్జిమెంటే కారణం. నాన్నగారి సలహాని నేనెంత ఎక్కువగా తీసుకుంటే నా కెరీర్ అంత బాగుంటుంది’’ అని సుమంత్ అశ్విన్ చెప్పారు. అగ్ర నిర్మాత ఎమ్మెస్ రాజు తనయుడైన సుమంత్ అశ్విన్ హీరోగా చేసిన చిత్రం ‘చక్కిలిగింత’. వేమారెడ్డి దర్శకత్వంలో సీహెచ్. నరసింహాచారి, నరసింహారెడ్డి ఇలవల నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా సుమంత్ అశ్విన్‌తో జరిపిన ఇంటర్వ్యూ...
‘చక్కిలిగింత’ ఒప్పుకోవడానికి కారణం ఏంటి?
వేమారెడ్డిగారు ఈ కథ నేరేట్ చేసినప్పుడు, అసలాయన బ్రెయిన్‌లోకి ఇలాంటి కాన్సెప్ట్ ఎలా వచ్చిందబ్బా అనిపించింది. చేయకపోతే మంచి సినిమా మిస్సయినట్లే అనిపించింది. సుకుమార్‌గారు, వేమారెడ్డిగారు మంచి స్నేహితులు. ఇద్దరి ఆలోచనలు వినూత్నంగా ఉంటాయి. ‘నా ఆలోచనలకన్నా వేమారెడ్డివి ఇంకా వినూత్నంగా ఉంటాయి’ అని సుకుమార్ ఓ సందర్భంలో అన్నారు. అతిశయోక్తి కాదు కానీ.. హాలీవుడ్ చిత్రం ‘ఇన్‌టర్‌స్టెల్లార్’ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ థాట్స్‌కి దగ్గరగా వేమారెడ్డిగారివి ఉంటాయి.
అంటే.. ఈ కాన్సెప్ట్‌కీ, ఏదైనా హాలీవుడ్ చిత్రానికీ పోలిక ఉంటుందా?
ఇది పూర్తిగా ఒరిజినల్ కాన్సెప్ట్. వేరే సినిమా పోలికలు ఇసుమంత కూడ కనిపించవు. ఈ కథ చెప్పిన తర్వాత ‘నువ్వు అన్ని రకాల సినిమాలు చూస్తావ్ కదా.. ఈ కాన్సెప్ట్ ఏ సినిమాలో అయినా కనిపించిందా’ అనడిగారు వేమారెడ్డి. లేదన్నాను.
ఇప్పటిదాకా లవర్ బోయ్‌గానే చేశారు. మరి, ఈ చిత్రంలో ఫైట్స్ ఏమైనా?
ఓ రోజు ఇంట్లో ‘ఇవాళ షూటింగ్ విశేషాలేంటి’ అని నాన్నగారడిగితే, ‘ఫైట్ చేస్తున్నా’ అన్నా. వెంటనే, ‘నువ్వేమైనా ప్రభాస్‌వా? మహేశ్‌వా?’ అన్నారు. దాంతో వేమారెడ్డిగారికి ఫోన్ చేసి, ‘నేను ఫైట్స్ చేస్తే బాగుంటుందా’ అనడిగితే ‘అందుకేగా మొదట్నుంచీ బాస్కెట్‌బాల్ ప్లేయర్‌గా చూపాం. పవర్‌ఫుల్‌గా ఆవిష్కరించాం’ అన్నారు.
ఓకే.. ఈ చిత్రంలో లిప్ లాక్ సీన్ ఉందట?
ఉంది కానీ.. దాన్ని లిప్ లాక్ అనరు. జస్ట్ పెక్ అంటారు. సిక్స్ ప్యాక్ అయినా, హాట్ కిస్సయినా.. ఏదైనా కథానుగుణంగా ఉంటేనే నేను చేస్తాను.
మీరు హీరో రామ్‌ని అనుకరిస్తారని కొంతమంది అంటారు?
అంటే అననివ్వండి.. ఫర్వాలేదు. ఎంత పెద్ద స్టార్‌నయినా.. ఏ హాలీవుడ్, బాలీవుడ్ స్టార్‌తోనో పోల్చుతారు. నటనలో పోలికలు కనిపించడం సహజం. కానీ, నేనెవర్నీ అనుకరించలేను. ఎందుకంటే, నాకు అనుకరించడం చేత కాదు. మా నాన్నగారు మహేశ్‌బాబు, ప్రభాస్.. ఇలా పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు తీసినప్పుడు నేను లొకేషన్లో ఉండి, వాళ్ల క్రమశిక్షణను ఆదర్శంగా తీసుకున్నాను కానీ, నటనను అనుకరించడానికి ప్రయత్నం చేయలేదు.
మీ లైఫ్‌లో ఎవరైనా అమ్మాయి ఉన్నారా?
లేరండి. అయినా అమ్మాయి ఉంటే ప్రాబ్లమ్. చీటికి మాటికి ఎస్‌ఎమ్‌ఎస్‌లు చేస్తారు.. వాటికి స్పందించకపోతే ఏకంగా ఫోన్ చేసేస్తారు. షూటింగ్‌లో ఉన్నాం కదా.. తర్వాత చేద్దాం అనుకుంటే అలుగుతారు. అలాంటి అమ్మాయిలు నాకొద్దండి బాబూ. అర్థం చేసుకునే అమ్మాయి అయితే ఓకే. కానీ, ప్రస్తుతానికి నా లైఫ్‌లో అమ్మాయి లేదు.