ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు : సుమంత్ అశ్విన్
మూడేళ్లు...అయిదు సినిమాలు...నాలుగు హిట్లు.
ఇదీ యువ కథానాయకుడు సుమంత్ అశ్విన్ ప్రోగ్రెస్ రిపోర్ట్. ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు తనయుడిగా బలమైన పునాదితో ఎంటరైన అశ్విన్ తనకంటూ ఓ విభిన్న మార్గంలో నడుస్తూ అటు యువతను, ఇటు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇటీవలే ‘కేరింత’తో సూపర్‌హిట్ సాధించిన సుమంత్ అశ్విన్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా అతనితో ‘సాక్షి’ జరిపిన భేటి...
హీరోగా మీకిది మూడో పుట్టినరోజు.. కెరీర్‌ని విశ్లేషించుకుంటే ఏమనిపిస్తోంది?
ఇప్పటివరకు ఐదు సినిమాలు చేశాను. మొదటి సినిమా ‘తూనీగ తూనీగ’ యావరేజ్‌గా ఆడింది. ఆ సినిమా విడుదలైన వారానికి ‘అంతకు ముందు ఆ తర్వాత’ సినిమాకి అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు ఇంద్రగంటి మోహన్‌కృష్ణ, నిర్మాత దామూగారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే, ఆ చిత్రం నాకు మంచి బ్రేక్ అయ్యింది. ఆ తర్వాత మారుతీగారితో చేసిన ‘లవర్స్’ మంచి కమర్షియల్ హీరోగా బ్రేక్ ఇచ్చింది. ‘చక్కిలిగింత’ ఆశిం చిన ఫలితం ఇవ్వలేదు. ఐదో సినిమా ‘కేరింత’ సూపర్ హిట్. నటుడిగా సినిమా సినిమాకీ నిరూపించుకుంటూ, ముందుకెళుతున్నా.
‘కేరింత’కు మొదట్లో డివైడ్ టాక్ వచ్చింది కదా?
అవును. ‘దిల్’ రాజుగారు ఎంతో నమ్మి ఈ సినిమా తీశారు. కానీ, మొదట్లో టాక్ డివైడ్‌గా ఉండటం ఆయన్ను నిరుత్సాహపరిచింది. కానీ, టాక్‌తో సంబంధం లేకుడా వసూళ్లు బాగున్నాయి. ఇప్పుడు సూపర్ హిట్ స్థాయికి చేరుకుంది.
విడుదలైనప్పుడు వచ్చిన టాక్‌కి మీరేమైనా టెన్షన్ పడ్డారా?
ఈ సినిమాపై నాకు చాలా నమ్మకం ఉండేది. అందుకని టెన్షన్ పడలేదు. ఫస్ట్ హాఫ్ బ్రహ్మాండం. సెకండాఫ్‌లో చివరి 40 నిమిషాలు కూడా అలానే ఉంటుంది. కచ్చితంగా యూత్, ఫ్యామిలీస్ అందరూ కనెక్ట్ అవుతారనుకున్నాను. నా నమ్మకం నిజమైంది. మొదట ఈ చిత్రానికి డివైడ్ టాక్ రావడానికి కారణం ‘హ్యపీ డేస్’ని మళ్లీ తీశారని కొంతమంది ఊహించుకోవడం, స్కూల్స్ తెరవడం, వర్షాలు. ఆ తర్వాత బాగుందనే టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఈ చిత్రం విజయ యాత్రలో భాగంగా విజయనగరం వెళ్లిప్పుడు, ఓ టీ స్టాల్ దగ్గర కారు ఆపాం. అప్పుడు జనాలు గుమిగూడిపోయి, బాగా మాట్లాడారు. పిల్లలైతే, ఈ సినిమాలో నేను చేసిన పాత్ర పేరుతో పిలిచారు. ‘జై అన్నా.. జై అన్నా..’ అన్నారు. నాకిలా జరగడం ఇదే మొదటిసారి. అలాగే, ఇలాంటి అబ్బాయి, ఇటువంటి అన్నయ్య, ఇలాంటి ఫ్రెండ్ ఉంటే బాగుంటుందని ‘జై’ పాత్రను చూసినవాళ్లు అంటున్నారు.
నూకరాజు పాత్ర విషయంలో శ్రీకాకుళంవాళ్లు హర్ట్ అయ్యారట?
ఈ పాత్ర ఎవర్నీ కించపరిచే విధంగా ఉండదు. శ్రీకాకుళం యాసలో నూకరాజు మాట్లాడతాడు. అలాంటివాళ్లు ఉంటారు కదా. ఏ శ్లాంగ్ వాడినా, వివాదం చేస్తే, అసలు సినిమానే తీయలేం.
కొంత భాగం రీషూట్ చేశారని తెలిసింది?
అవును. అది నిజమే. ‘దిల్’ రాజుగారు అన్నీ పర్‌ఫెక్ట్‌గా ఉండాలనుకుంటారు. 25 రోజులు కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాం. కానీ, అవి కథకు కనెక్ట్ కాలేదనిపించి, రీషూట్ చేశారు. అలా రీషూట్ చేశారు కాబట్టే, ఈ రోజు వంద శాతం విజయాన్ని ఈ చిత్రం సొంతం చేసుకుంది. లేకపోతే, 60, 70 శాతంతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది.
సోలో హీరోగా చేస్తున్న మీరు, ఈ చిత్రంలో మరో ఇద్దరు కుర్రాళ్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు?
ఈ మాట నాలో చాలామంది అన్నారు. ‘చక్కగా సోలో హీరోగా చేస్తున్నావ్? ఇప్పుడీ సినిమా ఎందుకు? సోలో హీరో సినిమా కమిట్ అయ్యి, మార్కెట్‌ని పెంచుకోవచ్చుగా?’ అనడిగారు. నేనీ సినిమా చేయడానికి మొదటి కారణం ‘దిల్’ రాజుగారు. ఆ తర్వాత కథ, నా పాత్ర బాగా నచ్చడంతో చేశాను. ఇలాంటి చిత్రాలు వదులుకుంటే మళ్లీ భవిష్యత్తులో వస్తాయనే గ్యారంటీ లేదు. అందుకే చేశా.
లవర్‌బోయ్ పాత్రలకే పరిమితమవుతున్నట్లున్నారు?
హిందీ పరిశ్రమను తీసుకుందాం. ఆమిర్‌ఖాన్ రావడం రావడమే ‘గజిని’ చేయలేదు. ముందు లవర్‌బోయ్ పాత్రలు చేశారు. ఆ తర్వాత మెల్లిగా మాస్ క్యారెక్టర్లు చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు నేను లవర్‌బోయ్ పాత్రలు చేసే వయసులో ఉన్నాను. ఈ వయసులో ఇవి చేయకపోతే ఆ తర్వాత చేయలేను. అందుకే ఇంకొన్నాళ్లు ఈ తరహా పాత్రలు చేస్తాను.
ప్రస్తుతం ఏం సినిమా చేస్తున్నారు?
‘కొలంబస్’ అనే చిత్రంలో నటిస్తున్నా. అది ఈ ఏడాదే విడుదలవుతుంది. మరో సినిమా చర్చల దశలో ఉంది.
సినిమాలు కాకుండా మీకిష్టమైన అంశాలు?
ఏమీ లేవు. ప్రస్తుతం నా దృష్టంతా సినిమాల పైనే.
పెళ్లి గురించి కూడా ఆలోచించరా?
అసలా ఆలోచనే లేదు.
మరి, ఇంట్లోవాళ్లు ఒత్తిడి చేయరా?
పెళ్లికి ఇంకా టైముందండి. మా ఇంట్లో మేమంతా ఆలోచించేది సినిమాల గురించే. రోజంతా షూటింగ్ చేసి, ఇంటికి వచ్చిన తర్వాత కూడా సినిమా గురించే ఆలోచిస్తా.. మా ఇంట్లో మేమందరం కలిసే భోజనం చేస్తాం. ఆ సమయంలో సినిమాల గురించి తప్ప వేరే మాట్లాడుకోం.
ప్రొఫెషన్‌కి పూర్తిగా అంకితమైపోయినట్లున్నారు?
అవును. ఆ డెడికేషన్ లేకపోతే కష్టం. ఇష్టంగా హీరో అయ్యా. నిరూపించుకోవడానికి ఇష్టంగా కృషి చేస్తున్నా. యూత్, ఫ్యామిలీస్ అందరూ నన్నిష్టపడుతున్నారు. అందుకే, ఇంకా ఇంకా కష్టపడాలని ఉంది.