
‘‘నేను హీరో కాక ముందు నుంచి సునీల్ అన్నతో మంచి పరిచయం ఉంది. ‘ఢీ’ సినిమాకు నన్ను అసిస్టెంట్ డైరెక్టర్‌గా రికమండ్ చేసింది ఆయనే. తను స్టార్ కమెడియన్‌గా ఉన్నప్పుడే నాతో ఎంతో సన్నిహితంగా మెలిగేవారు. నాలో కాన్ఫిడెంట్ పెంచిన వ్యక్తి ఆయనే. ‘2 కంట్రీస్’ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందనడంలో సందేహం లేదు’’ అని హీరో నాని అన్నారు. సునీల్, మనీషా రాజ్ జంటగా ఎన్. శంకర్ స్వీయదర్శకత్వంలో నిర్మించిన ‘2 కంట్రీస్’ ఈ నెల 29న విడుదలవుతోంది. గోపీ సుందర్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఎన్.శంకర్ మాట్లాడుతూ– ‘‘హార్ట్ టచింగ్ ఎలిమెంట్స్‌తో పాటు హ్యూమన్ వేల్యూస్ ఉన్న చిత్రమిది. చీకటిని చీకటి జయించదు. వెలుగే జయిస్తుంది. అలాగే, ద్వేషాన్ని ద్వేషం జయించదు. ప్రేమ మాత్రమే జయిస్తుంది. ఇప్పటి యువత వేగవంతమైన జీవితంలో పడి చాలా విషయాలను మరచిపోతున్నారు. అందులో నిజమైన ప్రేమ ఒకటి.
నిజమైన ప్రేమ గుండెను తాకితే ఎలా ఉంటుందో తెలిపే చిత్రమే ఇది. సునీల్ ఒక ట్రాన్స్‌ఫార్మర్. తను ఓన్ చేసుకుని నటించాడు’’ అన్నారు. ‘‘మలయాళ హీరో దిలీప్ సినిమాలు నాకు చక్కగా సూట్ అవుతాయి. ఆయన నటించిన ఓ మలయాళ మూవీని ‘పూల రంగడు’గా తెలుగులో రీమేక్ చేసి సక్సెస్ సాధించా. ఇప్పుడు ‘2 కంట్రీస్’ చేయడం ఆనందంగా ఉంది. సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు సునీల్. సునీల్ నారంగ్, కిరణ్, అనిల్ రావిపూడి, దశరథ్, శ్రీనివాసరెడ్డి, శివారెడ్డి, బి.వి.ఎస్.రవి, వెంకీ కుడుముల, ఇ.సత్తిబాబు, వి.ఎన్.ఆదిత్య, సురేశ్ కొండేటి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment