ఓటు వేయని సూర్య
తమిళసినిమా: నూరు శాతం ఓట్లు నమోదు కావాలి.అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి అంటూ ప్రచారం చేసిన నటుడు సూర్య తన ఓటును వృథా చేయడం విమర్శలకు దారి తీసింది. సోమవారం జరిగిన రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో సూపర్‌స్టార్ రజనీకాంత్ నుంచి పలువురు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కమలహాసన్ విదేశాల్లో తన షూటింగ్‌ను కూడా రద్దు చేసుకుని ఓటు వేశారు.ఇక ఓటు వేస్తారో లేదో అని పరిశ్రమ వర్గాల్లో చర్చకు తావిచ్చిన నటుడు అజిత్ కూడా ఉదయాన్నే సతీసమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కాగా ఎన్నికల అధికారులు నిర్వహించిన ఓటు యొక్క అవశ్యకతను వివరించే ప్రచార చిత్రాలలో నటించి అందురూ ఓటు వేయండి, నూరు శాతం పోలింగ్ నమోదు కావాలి అంటూ ప్రచారం చేసిన నటుడు సూర్య ఓటు వేయకుండా తన చిత్ర ప్రచారం కోసం అమెరికా వెళ్లడాన్ని పలువురు విమర్శిస్తున్నారు.ఎన్నికల కమీషన్ ఓటర్ల పట్టికలో ఓటర్ల పేర్లను సరిగా నమోదు చేయడంలోనూ,ఓటర్ల ఫోటోలను సక్రమంగా పొందుపరచడంలోనూ దృష్టి సారించకుంగా రూ. 200 కోట్లు ఖర్చు చేసి సినీ తారలతో ఓటింగ్‌పై అవగాహనా ప్రచార చిత్రాలను రూపొందించి టీవీ.చానళ్లలో ప్రచారం చేయడానికే అధిక ప్రాముఖ్యత నిచ్చారు.అలా ప్రచార చిత్రాలలో నటించిన నటుల్లో సూర్య ఒకరు.
అలాంటి ఆయన తన ఓటు హక్కును ఉపయోగించుకోకుండా తన చిత్ర ప్రచారం కోసం అమెరికాలో కూర్చున్నారు.దీని గురించి ఆయన వివరణ రూపంలో ఒక ప్రకటన విడుదల చూస్తూ తాను ఓటింగ్ రోజుకు చెన్నైకి తిరి చేరుకునేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు అయినా అనివార్యకారణాల వల్ల చెన్నైకి చేరుకోలేక పోయాననీ,ఆన్‌లైన్ లాంటి ఇతర సోర్సెస్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవాలన్న ప్రయత్నం సఫలం కాలేదనీ పేర్కొన్నారు.
తాను అందరికీ ఓటు వేయమని చెప్పి తాను ఓటు వేయనందుకు తమిళ ప్రజలకు క్షమాపణ చెప్పుకుంటున్నానని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. తనకు పార్టీల గురించి తెలియని ఒక నిరుపేద నటి డబ్బు కోసం డీఎంకే,అన్నాడీఎంకే పార్టీలకు సంబంధించిన ప్రచార చిత్రాలలో నటిస్తే విమర్శలు గుప్పించిన వారు ఒక ప్రముఖ నటుడు తన ఓటును దుర్వినియోగం చేయడంపై మాట్లాడరా అన్న ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి.ఇకపై ఎన్నికల కమీషన్ తారలతో అవగాహనా ప్రచార చిత్రాలు చేయడం మానుకోవాలనే గొంతు వినిపిస్తోంది.