
తాప్సీ
గేమ్ ఓవర్ అంటున్నారు తాప్సీ. ఇంతకీ ఏ ఆట? ఎవరు ఎవరితో ఆడారు? చివరికి ఎవరి ఆట ముగిసింది? అన్నది తెలియాలంటే ఈ నెల 14 వరకూ వేచి చూడాల్సిందే. తాప్సీ లీడ్ రోల్‌లో అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఓవర్’. వై నాట్ స్టూడియోస్ పతాకంపై ఎస్.శశికాంత్ నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషలలో ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా శశికాంత్ మాట్లాడుతూ– ‘‘భారతీయ సినీ చరిత్రలో ఇంత వరకూ రాని సరికొత్త కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. వెన్నులో వణుకు పుట్టించే కథ, కథనాలు ఈ థ్రిల్లర్ మూవీ ప్రత్యేకతలు.
హిందీ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ చిత్రానికి హిందీలో సమర్పకునిగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 1200కు పైగా స్క్రీన్స్‌లో సినిమా రిలీజవుతోంది. మూడు భాషల్లోని చిత్ర ప్రముఖులు ‘గేమ్ ఓవర్’ ట్రైలర్‌ను చూసి ప్రశంసలతో ట్వీట్స్ చేయటంతో ప్రేక్షకుల్లో మా చిత్రంపై అంచనాలు పెరిగాయి. మా బ్యానర్లో వచ్చిన ‘లవ్ ఫెయిల్యూర్’,‘గురు’ చిత్రాల విజయాల సరసన ఈ ‘గేమ్ ఓవర్’ నిలుస్తుంది’’ అన్నారు. ‘‘గేమ్ ఓవర్’ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్‌ను కలిగిస్తుంది. అశ్విన్ శరవణన్ తెరకెక్కించిన తీరే దీనికి కారణం’’ అన్నారు తాప్సీ. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: ముత్తురామలింగం, సహ నిర్మాత: చక్రవర్తి రామచంద్ర.