తెలుగు చిత్రాల షూటింగ్స్‌ని ఆపివేయాలని ఆదివారం తెలుగు ఇండస్ట్రీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తమిళ చిత్రాల షూటింగ్స్ కూడా ఆగిపోనున్నాయి. ఈ నెల 19 నుంచి షూటింగ్స్‌ని ఆపివేస్తామని ‘ఫెఫ్సీ’ (దక్షిణ చలన చిత్ర కార్మికుల సమాఖ్య) సోమవారం ప్రకటించింది. ‘‘భారీ నష్టం జరుగుతుంది. అయితే ఒక సమస్య వచ్చినప్పుడు అందరూ కలిసికట్టుగా ఉండాలి. నిర్ణయాలకు కట్టుబడాలి. మా కార్మికుల క్షేమమే మాకు ముఖ్యం.
నిర్మాతలు, సాంకేతిక నిపుణులందరూ మా నిర్ణయాన్ని ఆమోదించి ఈ 19 నుంచి షూటింగ్స్ ఆపివేయాలని విన్నవించుకుంటున్నాం’’ అని ‘ఫెఫ్సీ’ అధ్యక్షుడు, దర్శకుడు ఆర్.కె. సెల్వమణి ఓ ప్రకటన ద్వారా తెలిపారు. సినిమా షూటింగ్స్ మాత్రమే కాదు టీవీ కార్యక్రమాలు, వాణిజ్య ప్రకటనల చిత్రీకరణను కూడా నిలిపివేయమని కోరారు. మళ్లీ షూటింగ్‌లు ఎప్పుడు మొదలుపెట్టాలన్నది పరిస్థితులను బట్టి నిర్ణయిస్తామని కూడా పేర్కొన్నారు. కరోనా కారణంగా ఇప్పటికే విక్రమ్ ‘కోబ్రా’, అజిత్ ‘వలిమై’, శింబు ‘మానాడు’ చిత్రాల విదేశీ షెడ్యూల్స్ రద్దయ్యాయి. అన్ని చిత్రాల షూటింగ్స్ నిలివేయాలని సోమవారం తీసుకున్న నిర్ణయంతో ఇక్కడ తెలుగు స్టూడియోలు ఖాళీగా ఉన్నట్లే తమిళ స్టూడియోలు కూడా ఖాళీగా ఉండబోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment