నచ్చకపోతే వదిలేస్తా! | tapsi about her movie | Sakshi
Sakshi News home page

నచ్చకపోతే వదిలేస్తా!

Published Sat, Dec 24 2016 1:43 AM | Last Updated on Mon, Sep 4 2017 11:26 PM

నచ్చకపోతే వదిలేస్తా!

నచ్చకపోతే వదిలేస్తా!

నచ్చకపోతే వదిలేస్తానంటోంది నటి తాప్సీ. తెలుగు, తమిళం భాషల్లో నాయకిగా ఒక రౌండ్‌ కొట్టేసిన ఈ ఉత్తరాది భామ తాజాగా బాలీవుడ్‌పై దృష్టి సారించింది. ఆ మధ్య బిగ్‌బీ అమితాబ్‌తో నటించిన పింక్‌ చిత్రం మంచి విజయం సాధించడంతో పాటు తాప్సీ నటనకు ప్రశంసలు అందాయి. దీంతో ఈ అమ్మడికక్కడ చేతి నిండా చిత్రాలు ఉన్నాయి. ఒక తెలుగు చిత్రంలోనూ నటిస్తున్న తాప్సీ ఒక భేటీలో మాట్లాడుతూ తాను ఇష్టపడి సినిమాల్లోకి రాలేదన్నారు. మోడలింగ్‌పై ఆసక్తితో ఆ రంగంలోకి వచ్చానని, ఆ తరువాత ఆ రంగం ద్వారా సినిమా అవకాశాలు వచ్చాయని చెప్పింది. అప్పుడు కూడా చేతి ఖర్చుల కోసమే చిత్రాల్లో నటించానని అంది. అలాంటిది ఒక దశలో సినిమా బాగా నచ్చిందని, దాంతో నటనపై ప్రత్యేక దృష్టి సారించానని తెలిపింది.

తనకు ఆత్మవిశ్వాసం అధికం అని పేర్కొంది. దేనికీ భయపడను. తాను మోడలింగ్‌ చేసేటప్పుడు తన తండ్రి కంటికి నిద్రలేకుండా బతికారని అంది. అందుకు కారణం తన గురించి నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారేమోనన్న భయమేనని చెప్పింది.ఆ తరువాత తన ప్రకటనలు ప్రసారం అవుతుండగా ఆయన స్నేహితులు ప్రశంసిస్తుంటే నమ్మకం కుదిరిందని తెలిపింది. చుట్టు పక్కల వారికి భయపడే తల్లిదండ్రులు ఆడపిల్లకు స్వేచ్ఛ లేకుండా పెంచుతున్నారని అంది. తాను అలాంటి కుటుంబం నుంచి వచ్చినదానినేనని పేర్కొంది. కట్టుబాట్లలో పెరిగినంత వరకూ తనకు బాహ్య ప్రపంచం గురించి ఏమీ తెలియదని అంది. సినీరంగ ప్రవేశం తరువాత స్నేహితులు, ఇతరుల సహచర్యంతో ప్రపంచాన్ని చూశానని చెప్పింది. ఇప్పుడు తన తల్లిదండ్రులు తాను చెప్పింది వినడంతో పాటు మహిళలకు కట్టుబాట్లు అవసరం లేదని నమ్మతున్నారని చెప్పింది.

కట్టుబాట్లు అనేవి స్త్రీలను అణచి వేయకూడదని అంది. ఇతరుల గురించి ఆలోచించడం పట్టించుకోవడం వదిలి మనగురించి ఆలోచిస్తే సంతోషం కలుగుతుంది, మన గురించి కాకుండా వారి గురించి ఆలోచిస్తే ఆనందానికి దూరం అవుతామని అంది. తనకు నటిగా సంతోషం లభిస్తోందిని, ఇష్టం లేకపోతే నటనను వదిలేస్తానని చెప్పింది. ప్రస్తుతం తమిళం, తెలుగు భాషల్లో అవకాశాలు తగ్గాయని, మంచి అవకాశాలు వస్తే ఆ భాషల్లో నటిస్తానని అంది. ఇకపోతే తాను పెళ్లికి తొందర పడడం లేదని, నచ్చిన వ్యక్తి తారస పడ్డప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తానని తాప్సీ చెప్పుకొచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement