చాలా రోజుల తర్వాత మంచి సినిమా చేశా
– గోపీచంద్చ్– గోపీచంద్చ్– గోపీచంద్
‘‘సంపత్ రెండున్నర గంటలు ఈ కథ చెప్పాడు. మొత్తం విన్న నెక్ట్స్ మినిట్ ఓకే చెప్పాను. అయితే ఎక్కువ బడ్జెట్ అవుతుందేమోనని నిర్మాతలతో అన్నాను. కథను నమ్మి, వారు ఖర్చు పెట్టారు. ఈ నిర్మాతలతో మళ్లీ ఓ సినిమా చేయాలనుంది’’ అని గోపీచంద్ అన్నారు. గోపీచంద్ హీరోగా, హన్సిక, కేథరిన్ హీరోయిన్లుగా సంపత్ నంది దర్శకత్వంలో శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మించిన చిత్రం ‘గౌతమ్‌నంద’. ఎస్.ఎస్. తమన్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని కేథరిన్ రిలీజ్ చేసి గోపీచంద్‌కి అందించారు. నిర్మాత బీవీయస్‌యన్ ప్రసాద్ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేశారు.
గోపీచంద్ మాట్లాడుతూ– ‘‘కెమెరామెన్ సౌందర రాజన్ గురించి విన్నా... ఈ సినిమా ద్వారా ఆయన వర్క్‌ని స్వయంగా చూశా. డైరెక్టర్‌గారి విజన్‌ను విజువల్‌గా వంద శాతం తెరపైకి తీసుకొచ్చారాయన. తొలిసారి ఇద్దరు హీరోయిన్లతో నటించా. ‘శంఖం’ తర్వాత తమన్‌తో ఈ సినిమా చేశా. సంగీతం కంటే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ప్రాణం. ‘గౌతమ్‌నంద’ తన మనసుకు నచ్చిన సినిమా అని తమన్ అన్నాడంటే బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఇరగదీసుంటాడు. నేను చేసిన బెస్ట్ డైరెక్టర్లలో సంపత్ ఒకరు. తనతో ఎప్పుడైనా మరో సినిమా చేస్తా. అంత నమ్మకం వచ్చింది. నేను గుండెలపై చేయి వేసుకుని చెప్పగలను.
చాలా రోజుల తర్వాత బాగా యాక్ట్ చేశాననే సంతృప్తి ఇచ్చిన సినిమా ఇది. ‘గౌతమ్‌నంద’ వంటి మంచి సినిమా చేశానని ఎప్పుడైనా ధైర్యంగా నా కుటుంబ సభ్యులకు, పిల్లలకు కూడా చెప్పగలను. ఈ సినిమా ప్రేక్షకుణ్ణి డిజప్పాయింట్ చేయదు’’ అన్నారు. సంపత్ నంది మాట్లాడుతూ– ‘‘భగవాన్ శ్రీ రమణ మహర్షిగారి ఒక అక్షరాన్ని తీసుకుని ఈ కథ తయారు చేశా. టాప్ టెన్ మంచి కథల్లో ఈ సినిమా ఉంటుంది. మంచి కథకి తగ్గట్టు హీరో దొరకాలి. రెండున్నర గంటలు కథ విని ఒక్క అక్షరం కూడా మార్చమనకుండా అలాగే తీయమని గోపీగారు అన్న మాటలే నాకు ఆక్సిజన్‌లా పనిచేశాయి.
గోపీగారి నుంచి వంద శాతం నటన ఎక్స్‌పెక్ట్ చేస్తే వెయ్యి శాతం ఇచ్చారాయన. ఈ సినిమాలో అభిమానులు ఆయన విశ్వరూపం చూడబోతున్నారు. ఈ నెల 28న మీ ముందుకు రానున్న ఈ చిత్రం ఎంటర్‌టైన్ చేస్తుంది’’ అన్నారు. ‘‘తొంభై రోజుల్లో కంప్లీట్ చేద్దామని ఈ సినిమాను స్టార్ట్ చేసి 115 రోజుల్లో ఏ సమస్యా లేకుండా కంప్లీట్ చేశాం. సినిమా హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాత పుల్లారావు. తమన్ మాట్లాడుతూ– ‘‘గోపీచంద్ గారితో ‘శంఖం’ తర్వాత ‘గౌతమ్‌నంద’ చేశాను. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుంది. సంపత్‌కి బ్రెయిన్‌లో హార్డ్‌డిస్క్ ఉంది. తనను సంతృప్తి పరచడం ఈజీ కాదు’’ అన్నారు. కేథరిన్, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి, ఫైట్‌మాస్టర్స్ రామ్–లక్ష్మణ్, కెమెరామెన్ సౌందర రాజన్, ఎడిటర్ గౌతమ్ రాజు, ‘గౌతమ్‌నంద’ ప్రమోషన్ పార్టనర్ ఏ.ఎం. రెడ్డి, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి తదితరులు పాల్గొన్నారు.