
ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్, రాఘవ లారెన్స్, శ్రీరామ్‌లపై శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు
సాక్షి, చెన్నై: టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి, అంతకు మించి తన మాటలు, ట్వీట్స్, పోస్ట్‌లతో సోషల్ మీడియాలో పలువురిపై నటి శ్రీరెడ్డి ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్, నానితో సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులపై శ్రీరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసి దుమారం రేపారు. అయితే తాజాగా శ్రీరెడ్డి కోలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖులపై చేసిన ఆరోపణలు వివాదస్పదంగా మారాయి. ఇప్పటికే కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్, రాఘవ లారెన్స్, శ్రీరామ్‌లపై శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
ఇదిలా ఉండగా.. శ్రీరెడ్డి ఆరోపణలపై బాధ్యులు బదులివ్వాలని ప్రముఖ దర్శకుడు, నటుడు, రాజకీయ నేత టీ రాజేందర్ వ్యాఖ్యానించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. శ్రీరెడ్డి విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు సమాధానం చెప్పి సమస్యను ఇంతటితో ముగింపు పలికితే మంచిదన్నారు. సినిమా ఇండస్ట్రీలో మంచి, చెడు రెండూ ఉంటాయని, అయితే వాటిని సమస్యాత్మకంగా వదిలేయకూడదని పేర్కొన్నారు. క్యాస్టింగ్ కౌచ్ ఇండస్ట్రీలో సహజమే, కానీ మా కాలంలో నా వ్యక్తిగతంగా నేను నటించిన, దర్శకత్వం వహించిన సినిమాల్లో ఏ కథానాయికను కనీసం టచ్ కూడా చేయలేదని గుర్తుచేశారు. ప్రస్తుతం సినిమా అలా కాదని రాజేందర్ వాపోయారు. సినీ పరిశ్రమలో ఇటువంటి బహిరంగ ఆరోపణలు ఆరోగ్యకరమైనవి కాదని అన్నారు.