
నటులకు బెదిరింపు లేఖలా?
నటులు శివకుమార్, విశాల్, నాజర్, సంతానం తదితరులకు మదురై నాటక రంగ నటుల పేరుతో హత్యా బెదిరింపు లేఖలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర కలకలాన్ని సృష్టించింది. ఈ బెదిరింపు లేఖల ఉదంతంపై దక్షిణ భారత నటీనటుల సంఘం అధ్యక్షుడు శరత్‌కుమార్ స్పందించారు. సంఘం తరపున అధ్యక్షుడు శరత్‌కుమార్, కార్యదర్శి రాధారవి, కోశాధికారి వాగైచంద్ర శేఖర్ ప్రకటన విడుదల చేశారు.
అందులో పేర్కొంటూ నటీనటుల సంఘం సీనియర్ సభ్యుల్లో ఒకరైన శివకుమార్, నటుడు నాజర్, విశాల్, సంతానంలకు హత్యా బెదిరింపు లేఖలు వచ్చిన విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యామన్నారు. తమ సభ్యులకు ఇలాంటి పిరికిపందల నుంచి బెదిరింపు లేఖలు రావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి అరాచక కార్యక్రమాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదన్నారు. పోలీసుల సహాయంతో వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.