మహానటులిద్దరూ జనవరిలోనే...
చలన చిత్ర పరిశ్రమకు మహానటులు నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు రెండు కళ్లలాంటివారు. దక్షిణాది సినిమా పరిశ్రమ బలపడటానికి, చిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్ తరలి రావడానికి ఈ ఇద్దరు మహానటుల సేవలు వెలకట్టలేనివి. నాలుగు దశాబ్దాల కెరీర్ లో వారి మధ్య పోటీ బయటకు కనిపించినా.. అంతేకంటే ఎక్కవ స్థాయిలో వారి మధ్య మైత్రీ బంధం ఉండేదని సహనటులు మాటల సందర్భంలో వెల్లడిస్తుంటారు. వారి మధ్య ఉన్న ధృడమైన స్నేహం బయటకు కూడా అలానే కనిపించేంది. ఎన్టీఆర్, ఏఎన్నార్ లు జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాలతో అఖిలాంధ్ర సినీ ప్రేక్షకులను ఆలరించారు.
సినీ హీరోల మధ్య ఉండే సహజంగా కనిపించే విబేధాలు, అహంకారపూరిత ధోరణి ఏమాత్రం కనిపించకుండా.. దశాబ్దాల పాటు మల్టీ స్టారర్ చిత్రాల్లో కనిపించి కొత్త భాష్యం చెప్పారు. వారిద్దరి మధ్య పోటీ ఓ రకంగా చిత్ర పరిశ్రమ అభివృద్దికి కారణమైందే కాని.. రెండు వర్గాలుగా విడగొట్టడానికి ఇసుమంతైనా అవకాశం కల్పించలేదు. కొన్నిసార్లు వారిమధ్య విబేధాలు తలెత్తినా... వ్యక్తిగతంగానే వాటిని చూశారు కాని.. పరిశ్రమలో గ్రూపిజానికి అవకాశమివ్వకుండా ఇద్దరు నటులు భావితరాల నటులకు ఆదర్శంగా నిలిచారు. మహానటుల ప్రతిభ, అంకుఠిత దీక్ష, తపన కేవలం తెలుగు చలన చిత్ర పరిశ్రమకే పరిమితం కాలేదు. ఆ కాలంలో తమిళంలో ఎంజీఆర్, శివాజీ గణేషన్, కన్నడంలో రాజ్ కుమార్, మలయాళంలో ప్రేమ్ నజీర్ లతో కలిసి దక్షిణాది చిత్ర పరిశ్రమ బలపడటానికి ఎనలేని కృషి చేశారు.
ఇక తెలుగు చలన చిత్ర పరిశ్రమను ఓ కుటీర పరిశ్రమ స్థాయి నుంచి భారీ పరిశ్రమ స్థాయిని కల్పించి ఎన్ టీఆర్, ఎఎన్ఆర్ లకే క్రెడిట్ దక్కుతుందనే చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇద్దరు మహానటులు వేసిన బీజమే ప్రస్తుతం ఉత్తరాది పరిశ్రమకు ధీటుగా పెంచేందుకు టాలీవుడ్ స్టామినాను పెంచేందుకు దోహదపడింది. వారు అందించిన సేవలు, చేసిన కృషి ఫలితంగానే టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఇతర పరిశ్రమలకు ధీటుగా ఎదిగింది. బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు సమానంగా ప్రస్తుత హీరోలు కోట్లాది రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోవడానికి ఓ స్టార్ డమ్ ను కల్పించింది ఎన్ టీఆర్, ఏఎన్నార్ లని చెప్పడానికి ఎలాంటి సందేహం అక్కర్లేదు.
నాలుగు దశాబ్దాలపాటు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సమాంతరం హోదాను అనుభవించిన మహానటులిద్దరూ కూడా జనవరిలోనే కన్నుమూయడం విషాదం.. యాదృచ్ఛికం. ఎన్ టీఆర్, ఏఎన్నార్ ఇద్దరూ ఉత్తరాయణ పుణ్యకాలంలోనే మృతి చెందారు. అంతేకాకుండా ఎన్ టీఆర్ జనవరి 18 తేదీన, ఏఎన్నార్ జనవరి 22 తేదీన తెల్లవారుజామునే తుది శ్వాస విడవడం యాదృచ్ఛికమే అయినా, వారి మధ్య స్నేహ, ఆత్మీయ బంధాలను అది ప్రతిబింబించిందని చెప్పుకోక తప్పదు.
-రాజబాబు అనుముల