
సుమోలు పేల్చకపోతే నిరుత్సాహపడతామన్నారు.. అందుకే..!
హీరోయిజాన్ని తెరపై ఆవిష్కరించడంలో వీవీ వినాయక్‌ది ఓ ప్రత్యేకమైన శైలి. ఆయన సినిమాల్లోని హీరోలు ఆఫ్రికన్ సింహాల్లా ఉంటారు. అందుకే... ప్రముఖ కథానాయకులు సైతం వినాయక్ దర్శకత్వంలో నటించడానికి ఉవ్విళ్లూరుతుంటారు. ఈ సారి అదృష్టం కొత్త హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌కి దక్కింది. తనను తెరకు పరిచయం చేస్తూ... వినాయక్ తెరకెక్కించిన ‘అల్లుడు శీను’ ఈ నెల 25న విడుదల కానుంది. నేడు వినాయక్ పుట్టిన రోజు. విడుదల కానున్న ఈ సినిమా గురించి, చేయనున్న ఇతర చిత్రాల గురించి ఆసక్తికరమైన విషయాలను చెప్పారు వినాయక్. ఆ విశేషాల్లోకి...
సాయిశ్రీనివాస్ నాకు తాను చిన్నపిల్లాడిగా ఉన్నప్పట్నుంచీ తెలుసు. బొద్దుగా, ముద్దుగా ఉండేవాడు. అప్పుడే ‘శ్రీనివాస్‌ని హీరో చేద్దామండీ’ అని బెల్లంకొండ సురేశ్‌తో అంటుండేవాణ్ణి. తథాస్తు దేవతలు తథాస్తు అన్నట్లున్నారు.
కొన్ని మంచి సినిమాలు వాటంతట అవే తయారవుతాయి అంటుంటారు. ఈ సినిమాకు అదే జరిగింది. జపాన్‌లో అత్యల్ప ఉష్ణోగ్రతల మధ్య ఈ షూటింగ్ చేయడం కష్టం అనిపించినా, చేసేశాం. అబూదాబీలో ప్రపంచ ప్రఖ్యాత రిసార్ట్ ఆల్‌ఖజ్రాలో షూటింగ్ జరుపుదాం అనుకున్నాం. కానీ ముందు కుదర్లేదు. తర్వాత అది కూడా అమరింది. షూటింగ్ మొదలుపెట్టే ముందు సమంత, తమన్నా లాంటి ఇద్దరు హీరోయిన్లతో పాటలు ఉంటే బావుంటుందని సురేశ్‌గారు అన్నారు. అనుకున్నట్లే సమంతతో పాటు తమన్నా కూడా వచ్చి చేరింది.
ప్రకాశ్‌రాజ్ లాంటి సీనియర్ ఆర్టిస్టుల ముందు కూడా అలవోకగా నటించేశాడు శ్రీనివాస్. సమంత, తమన్నాలతో డాన్స్ చేయడానికి జంకుతాడేమో అనుకున్నాను. కానీ... అదరహో అనిపించాడు. తనకు కష్టపడే తత్వం ఉంది. తప్పకుండా పెద్ద హీరో అవుతాడు.
సుమోలను పైకి లేపడం, బాంబ్ బ్లాస్టింగ్‌లు లేకుండా నా శైలికి భిన్నంగా ఈ సినిమా చేయాలనుకున్నా. కానీ... యూనిట్ మొత్తం విదేశాలకు వెళ్తుంటే... ఎయిర్‌పోర్ట్‌లో ఓ ఉన్నత అధికారి నన్ను చూసి ‘సార్.. వినాయక్‌గారూ.. ఈ సినిమాలో కూడా సుమోలను పేలుస్తున్నారా? బాగా పేల్చాలి. లేకపోతే మేం డిజప్పాయింట్ అవుతాం’ అన్నారు. నేను షాక్. ఒకవేళ ఇవేమీ లేకపోతే జనాలు కూడా డిజప్పాయింట్ అవుతారేమో అనిపించింది. అందుకే... ఇందులో కూడా యాక్షన్ ఉంటుంది.
సాయి శ్రీనివాస్ కొత్త హీరో. అతనితో భారీగా డైలాగులు చెప్పిస్తే ‘అవసరమా’ అంటారు. అందుకే, తన పాత్ర చిత్రణను జనాలకు చేరువయ్యేలా తీర్చిదిద్దాం. తక్కువ సంభాషణలతో హీరోయిజం ఎలివేటయ్యేలా తన పాత్ర ఉంటుంది. మామకు జరిగిన అన్యాయానికి అల్లుడు ఎలా బదులు తీర్చుకున్నాడనేది కథ. ఇందులో మామగా ప్రకాశ్‌రాజ్ నటించారు. బ్రహ్మానందంది గమ్మత్తయిన పాత్ర. ఆయన్ను బురిడీ కొట్టించాలనే ఉద్దేశంతోనే ‘నా పేరు అల్లుడు శీను’ అని చెబుతాడు హీరో. పేరు బావుందనిపించి టైటిల్‌గా ఫిక్స్ చేశాం.
చిరంజీవిగారి 150వ సినిమాకు దర్శకత్వం వహించాలని ఉంది. కానీ, అది చిరంజీవిగారి నిర్ణయంపై ఆధారపడి ఉంది. ప్రస్తుతం కథలు సిద్ధం చేసుకుంటున్నాం. ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ కథతో సినిమా ఉంటుందనే వార్తలో నిజం లేదు.
ఒకవేళ చిరంజీవిగారిని డెరైక్ట్ చేసే అవకాశం నాకే లభిస్తే... సరదాగా సాగిపోయే సినిమానే తీస్తా. మధ్యలో ఓ ఆసక్తికరమైన ఫ్లాష్‌బ్యాక్ ఉండాలి. అలాంటి కథ తీస్తే బావుంటుంది ‘ఠాగూర్’ నాటి చిరంజీవి ఇమేజ్‌కి ఇప్పటి ఇమేజ్‌కి చాలా తేడా ఉందని పలువురి భావన. అందులో నిజం లేదు. ఏ సినిమాకైనా మొదటి పది నిమిషాలే కీలకం. ఆ సమయంలోనే ప్రేక్షకుడు ఇమేజ్‌ల గురించి ఆలోచిస్తాడు. ఈలోపే అతణ్ణి కథలోకి లీనం చేయగలగాలి. అలా చేస్తే సినిమా హిట్.