
అంతకు మించి...
కొత్త కుర్రాడు... సహాయ దర్శకుడిగా ఎవరి దగ్గరా పని చేయలేదు... ఏదో పుస్తకం రాశాడంట! అతణ్ణి నమ్మి ఇంచు మించు 20 కోట్లతో రానా సినిమా చేస్తున్నాడు. పైగా, అదేదో సబ్‌మెరైన్ కాన్సెప్ట్ అట! ‘ఘాజీ’ విడుదలకు ముందు ఇండస్ట్రీలో ఏవేవో మాటలు వినిపించాయి. విడుదల తర్వాత నో మోర్ డిస్కషన్. సంకల్ప్ టాలెంట్, టేకింగ్, అందులో గ్రాఫిక్స్ ప్రేక్షకులకు నచ్చాయి.
అతనితో సినిమా చేయడానికి చాలామంది ఆసక్తి చూపించారు. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలని ప్రయత్నించకుండా, కథపై కాన్సంట్రేట్ చేశారు సంకల్ప్. సబ్‌మెరైన్ కాన్సెప్ట్‌తో ‘ఘాజీ’ తీసిన ఆయన, ఇప్పుడు సైన్స్ ఫిక్షన్ కథను సిద్ధం చేస్తున్నారు. ఇందులో వరుణ్ తేజ్ హీరో. ఈ సందర్భంగా సంకల్ప్ రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ– ‘‘ఇప్పటికి వరుణ్, నేను మాత్రమే ఫిక్స్. నిర్మాత, టెక్నీషియన్స్, ఇతర యాక్టర్స్ ఫిక్స్ కాలేదు.
‘ఘాజీ’కి మించిన బడ్జెట్‌తో, గ్రాఫిక్స్‌తో ఈ సినిమా తెరకెక్కుతుందని మాత్రం చెప్పగలను. ఇద్దరు ముగ్గురు నిర్మాతలు రెడీగా ఉన్నారు. కథ రెడీ కావడానికి టైమ్ పడితే... వరుణ్ మరో సినిమా చేసే ఛాన్సుంది. కానీ, మా కాంబినేషన్‌లో సినిమా మాత్రం పక్కాగా ఉంటుంది’’ అన్నారు.