
వెంకటేశ్, రానా కలసి పూర్తి స్థాయి సినిమాలో నటించబోతున్నారనే విషయం మనం చాలాసార్లు విన్నాం. కానీ, ప్రాజెక్ట్‌లు ఏవీ పట్టాలు ఎక్కకపోయేసరికి అభిమానులు నిరాశపడుతూ వస్తున్నారు. మొన్నామధ్య తమిళ బ్లాక్ బాస్టర్ ‘విక్రమ్ వేద’ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చినా అది కూడా మెటీరియలైజ్ కాలేదు. ఈసారి బాబాయ్–అబ్బాయ్ కాంబినేషన్ పక్కాగా సిద్ధం అయింది అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. కానీ, వాళ్లు నటించబోయేది సినిమాలో కాదట. ఒక వెబ్ సిరీస్‌లో ఈ దగ్గుబాటి హీరోలు నటించనున్నారట.
రాజీవ్ గాంధీ హత్య, ఆ తర్వాత ఎల్‌టీటీ ఫ్రభాకరన్ కథ ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ఉండనుందట. ‘సైనైడ్ , అట్టహాస’ వంటి చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ కన్నడ దర్శకుడు ఏయంఆర్ రమేష్ ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేయబోతున్నారని టాక్. తొలుత సినిమాగా ప్లాన్ చేసినప్పటికి చెప్పాల్సిన కథ ఎక్కువగా ఉండటంతో సినిమాగా కంటే వెబ్ సిరీస్‌గా బావుంటుందని దర్శకుడు భావించారట. దానికి వెంకటేశ్, రానా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇండస్ట్రీ టాక్. ఈ వెబ్ సిరీస్‌లో రాజీవ్ గాంధీ కేస్‌ను ట్రేస్ చేసిన ఐపీఎస్ ఆఫీసర్ డీఆర్ కార్తికేయ పాత్రలో వెంకటేశ్ కనిపించబోతున్నారట. మరి రానా? సస్పెన్స్ అంటున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో మొదలు కానున్న ఈ సిరీస్‌ను రానా తన సొంత బ్యానర్‌లో నిర్మించనున్నారని భోగట్టా.