
ప్రస్తుతం భారతీయ వెండితెర మీద రాజకీయ నేపథ‍్య చిత్రాల హవా కొనసాగుతోంది. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో దర్శక నిర్మాతలు రాజకీయ నేతలు, పార్టీల నేపథ్యంలో కథలు రెడీ చేసుకుంటున్నారు. ఇప్పటికే దక్షిణాదిలో యాత్ర, ఎన్టీఆర్ లాంటి సినిమాలు రెడీ అవుతుండగా ఇటీవల భరత్ అనే నేను రాజకీయ నేపథ్యంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘనవిజయం సాధించింది. త్వరలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చరిత్ర, సిద్ధాంతాలు, సాధించిన విజయాలను సినిమాగా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఆర్‌ఎస్‌ఎస్ ఛీప్ మోహన్ భగవత్ పర్యవేక్షణలో దాదాపు 180 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. బాహుబలి, భజరంగీ బాయ్‌జాన్ సినిమాలతో జాతీయ స్థాయిలో స్టార్ రైటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందిస్తున్నారు. అయితే దర్శకుడు ఎవరన్నది ఇంకా నిర్ణయించలేదు. ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. నటీనటుల ఎంపిక విషయంలో కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
ఉత్తరాదితో పాటు దక్షిణాదిలోనూ ఈ సినిమాను భారీగా రిలీజ్ చేయాలని భావిస్తున్న నేపథ్యంలో ఇరు ప్రాంతాలకు చెందిన నటీనటులను ఎంపిక చేయలాని నిర్ణయించారట. ప్రధాన పాత్రలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి రాబోయే లోక్‌సభ ఎన్నికలకు ముందే సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment