వైవిధ్యమైన పాత్రలో విశాల్
వైవిధ్యమైన పాత్రలు పోషించడంలో ఆసక్తిని కనబరిచే హీరోల్లో విశాల్ ఒకరు. ఆయన గత చిత్రాలే అందుకు నిదర్శనాలు. ఈ నెల 20న మరో వైవిధ్యమైన పాత్రతో విశాల్ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు. సినిమా పేరు ‘ఇంద్రుడు’. అనూహ్యమైన సంఘటన కళ్ల ముందు జరిగినా కూడా ఠక్కున నిద్రలోకి జారిపోవడం ‘నార్కొలెప్సీ’ అనే వ్యాధి లక్షణం. ఆ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిగా ఈ సినిమాలో విశాల్ కనిపించబోతున్నారు. తిరు దర్శకత్వంలో విశాల్ నటించిన తమిళ చిత్రం ‘నాన్ సిగప్పు మనిదన్’కు ఇది అనువాద రూపం. ఈ నెల 20న ‘ఇంద్రుడు’ విడుదల కానుంది.
లక్ష్మీమీనన్ కథానాయిక. నార్కొలెప్సీ వ్యాధి కారణంగా ఇందులో హీరోకు ఎలాంటి సమస్యలు తలెత్తాయి? వాటిని తను ఎలా ఎదుర్కోగలిగాడు? అనేది ఈ సినిమాలో ఆసక్తికమైన అంశమని దర్శకుడు చెబుతున్నారు. విశాల్, లక్ష్మీమీనన్‌ల కెమిస్ట్రీ తమిళనాట సంచలనం సృష్టించిందని, అయితే కథానుగుణంగానే వారితో ఆ హాట్‌సీన్స్‌ని తెరకెక్కించాల్సి వచ్చిందనితిరు తెలిపారు. శత్రువులను టార్గెట్ చేసి ఒక్కొక్కరినీ విశాల్ అంతం చేసే సన్నివేశాలు ఉద్రేకపూరితంగా ఉంటాయని ఆయన అన్నారు. యూ టీవీ మోషన్ పిక్చర్స్, విశాల్ కలిసి నిర్మించిన ఈ చిత్రంలో ఇనియా, శరణ్య ఇతర ముఖ్య పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాశ్‌కుమార్.