మంచి అనిపిస్తే చేసేస్తా! | vishal special interview for he's new movie release on friday marudu | Sakshi
Sakshi News home page

మంచి అనిపిస్తే చేసేస్తా!

Published Fri, May 20 2016 4:19 AM | Last Updated on Mon, Sep 4 2017 12:27 AM

మంచి అనిపిస్తే చేసేస్తా!

మంచి అనిపిస్తే చేసేస్తా!

రాజకీయం కాని పనేమీ కాదు అంటున్నారు ప్రముఖ యువ నటుడు విశాల్. ఈయన వార్తల్లోని వ్యక్తిగా మారి చాలా కాలమైంది. ఒక పక్క నటుడుగా విజయాలను సాధిస్తూనే, మరో పక్క నడిగర్‌సంఘం కార్యదర్శిగా చాలా బాధ్యతలను తన భుజాన వేసుకుని చురుకైన పాత్రను పోషిస్తున్నారు. అంతే కాదు వ్యక్తిగతంగా అవసరమైన వారికి తన వంతు సాయం చేయడంలో ముందుంటున్నారు.

ఇక సినిమాల పైరసీపై ఒంటరి పోరాటం చేస్తున్నారు. విశాల్ తాజా చిత్రం మరుదు శుక్రవారం తెరపైకి రానుంది. ఇది కమర్షియల్ అంశాలతో కూడిన పక్కా మాస్ కథా చిత్రం అని తెలుస్తోంది. శ్రీదివ్య కథానాయికగా నటించిన ఈ చిత్రానికి కొంబన్ చిత్రం ఫేమ్ ముత్తయ్య దర్శకుడు.ఈ చిత్ర విశేషాల గురించి విశాల్‌తో చిట్ చాట్..

ప్ర: మరుదు చిత్రం గురించి క్లుప్తంగా చెప్పండి?
జ:  మూటలు మోసే ఒక కూలీ ఇతివృత్తం మరుదు. ఆ వృత్తిపై, తన బామ్మపై ప్రేమాభిమానాలే చిత్రం. కుటుంబ విలువలను ఆవిష్కరించే చిత్రం మరుదు.

ప్ర:  చిత్రం కోసం మూటలు ఎత్తి విసిరేశారట?
జ:  ఈ చిత్రంలో పాత్ర నాకు చాలా కొత్త. డ్రాయర్ కనిపించే వరకూ లుంగీ పైకి ఎత్తి కట్టి నటించడం కూడా ఇంతకు ముందెప్పుడూ నటించలేదు. చెన్నై లయోలా కళాశాలాలో నటించిన నన్ను దర్శకుడు ముత్తయ్య గ్రామీణ యువకుడిగా మార్చేశారు. నాతో పాటు సూరిని 50 కిలోల బరువైన మూటలను ఎలా సులభంగా విసిరేయవచ్చో నేర్పించారాయన. నాకైతే మెడ నొప్పి పుట్టింది.

ప్ర: నటి శ్రీదివ్యతో నటించిన అనుభవం గురించి?
జ: ఆ చిత్రంలో శ్రీదివ్య నన్ను కొట్టారు.భయపెట్టారు కూడా. ఆమె పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది.

ప్ర:  చిత్రంలో మీరు నటుడు రాధారవితో సవాల్ విసిరే డైలాగ్స్ ఉన్నాయట?
జ:  ముందుగా ఒక విషయం చెప్పాలి. ఈ చిత్రానికి సంభాషణలు రాసింది నేను కాదు దర్శకుడే. నేను రాధారవి ఎలా నటిస్తామని మొదటి రోజు చిత్ర యూనిట్ చాలా టెన్షన్‌గా ఫీలయ్యారు. ఒక రకమైన నిశ్శబ్దం నెలకొంది. అయితే మాకు మాత్రం అలాంటి భావనే లేదు. ఇంకా చెప్పాలంటే ఈ డైలాగ్ ఇలా ఉండాలి, అలా ఉండాలి అని రాధారవినే సూచించారు. నిజంగా ఆయనది చాలా పెద్ద మనసు. నడిగర్‌సంఘం నిర్వాకం విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయి గానీ వ్యక్తిగతంగా మా ఇద్దరి మధ్య ఎలాంటి పగ లేదు.

ప్ర: ప్రచారానికి ప్రాధాన్యం ఇస్తున్నారనే ప్రశ్నకు మీ సమాధానం?
జ:  మనసుకు మంచి అనిపిస్తే దాన్ని ఆలస్యం చేయకుండా చేసేయాలన్నది నా పాలసీ. ఆ విషయంలో భయపడడం జరగదు. నన్ను చూసి 10 మంది సమాజానికి మంచి చేస్తే అది ఆహ్వానించదగ్గ విషయమేగా.

ప్ర: రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారా?
జ:  రాజకీయం కాని పనేమీ కాదు. నా దృష్టిలో అదీ ఒక వృత్తే. ఎంఎల్‌ఏ, ఎంపీలు తీసుకునే వేతనాలకంటే నేను సినిమా నటుడిగా ఎక్కు వే సంపాదిస్తున్నాను. వాళ్ల కంటే ఎక్కువగానే ఇతరులకు సాయం చేస్తున్నాను. ఏ పార్టీకి సంబంధం లేకుండా సమాజానికి మంచి చేయాలని ఆశిస్తున్నాను. ప్రస్తుతానికి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు.

 ప్ర:  నటుడు శరత్‌కుమార్‌తో ఎంతగా ఢీకొన్నా ఆయనకు అల్లుడు కానున్నారనే ప్రచారం గురించి?
జ: వరలక్ష్మి శరత్‌కుమార్ నాకు చిన్నతనం నుంచే తెలుసు. మేమిద్దరం చాలా కాలంగా స్నేహితులుగా మెలుగుతున్నాం. ఇకపోతే ప్రస్తుతానికి నాకు పెళ్లి ఆలోచన లేదు.నడిగర్‌సంఘానికి నూతన భవనాన్ని కట్టించడమే నా ముందున్న లక్ష్యం. 2018 జనవరి 14వ తేదీన సంఘ భవనానికి ప్రారంభోత్సవం జరగాలి. ఆ తరువాత నా పెళ్లి గురించి స్వయంగా నేనే వెల్లడి స్తాను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement