
ఆమె నా కంటే ఏడు అంగుళాల పొడుగు
హీరోయిన్ అనుష్క నా కంటే ఏడు అంగుళాల పొడుగు ఉంటుందని కేరళ కుట్టీ నిత్యమీనన్ తెలిపారు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన రుద్రమదేవి చిత్రంలో అనుష్క, నిత్యమీనన్ తల్లీకూతుళ్లుగా నటించారు. ఈ చిత్రంలో ఓ పాటను వీరిద్దరిపై చిత్రీకరించారు. ఈ సందర్భంలోనే తాను అనుష్క కంటే ఏడు అంగుళాలు పొట్టిగా ఉన్నానని గుర్తించినట్లు నిత్యమీనన్ తెలిపింది. చిత్ర షూటింగ్లో తనకు ఎదురైన అనుభవాలను ఈ సందర్భంగా నిత్యమీనన్ శుక్రవారం వెల్లడించింది.
అనుష్క కంటే పొట్టిగా ఉండటంతో తాను హైహీల్స్ చెప్పులు వేసుకుని మరీ ఆమెతో డాన్స్ చేయాల్సి వచ్చిందని తెలిపింది. తన జీవితంలో అంత ఎత్తు ఉన్న హైహీల్స్ వేసుకోవడం అదే తొలిసారి అని చెప్పింది. అన్నట్లు మరిచాను అనుష్కతో డ్యాన్స్ చేస్తున్న సమయంలో నా కాలు బెణికిందని చెప్పింది. డ్యాన్స్ షూటింగ్ సమయంలో అనుష్క తనకు ఎంతలా సహకరించిందో గుర్తు చేసుకుని మరీ నిత్య మురిసిపోయింది.
తామిద్దరి మధ్య చాలా పోలికలున్నాయంది. అవి ఆధ్యాత్మికం, యోగా... ఇలా అంటూ నవ్వుకుంది. జీవితంలో ఎప్పటికైనా యోగా టీచర్ కావాలని తన లక్ష్యమని నిత్య మీనన్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. అయితే అనుష్క యోగా టీచర్ అయి.. ఆ తర్వాత హీరోయిన్ అయిందని... కానీ తాను మాత్రం హీరోయిన్ నుంచి యోగా టీచర్గా మారనున్నట్లు నిత్య మీనన్ చమత్కరించింది. ఇళయరాజా సంగీతాన్ని అందించిన రుద్రమదేవి చిత్రంలో అల్లు అర్జున్, కృష్ణం రాజు, కేథరిన్, హంసా నందిని, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే.