
గుడ్ ఫ్రైడేకి... బాహుబలి-2
‘ఇంతకూ అమరేంద్ర బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?’ ‘బాహుబలి’ చూసిన ప్రతి ఒక్కరికీ ఈ మిస్టరీ తెలుసుకోవాలని ఉంటుంది. కట్టప్ప లాంటి నమ్మిన బంటు తన నాయకుణ్ణి చంపాడంటే దానికి బలమైన కారణం ఉండే ఉంటుంది. ఆ కారణం ఏమిటో తెలుసుకోవాలంటే ‘బాహుబలి-2’ చూడాల్సిందేనని చిత్ర బృందం పలు సందర్భాల్లో పేర్కొంది. తొలి భాగం కన్నా మరింత భారీ ఎత్తున రూపొందుతున్న మలి భాగంపై మరిన్ని అంచనాలు నెల కొన్నాయి.
ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్... ఇలా భారీ తారాగణంతో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్న ఈ రెండో భాగం షూటింగ్ కొన్ని రోజులుగా జరుగుతోంది. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం విడుదలవుతుందని ముందు వార్త వచ్చిన విషయం తెలిసిందే. అయితే, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్ 14న మలి భాగాన్ని విడుదల చేయాలనుకుంటున్నారని తెలిసింది. ఆ రోజు గుడ్ ఫ్రైడే. తమిళ సంవత్సరాది కూడా!