
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా తెరకెక్కిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో..’. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానున్నట్టు చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్ర విడుదల తేదీ మారిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ముందుగా ప్రకటించిన దాని కంటే రెండు రోజుల ముందుగానే(జనవరి 10) ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుందని.. దర్శక నిర్మాతలు అదే ఆలోచనలో ఉన్నారనేది ఆ వార్తల సారాంశం.
ఇప్పటికే విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం.. పలు పోస్టర్లలో కూడా దానిని వెల్లడించింది. అయితే తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో మాత్రం విడుదల తేదీని పేర్కొనలేదు. దీంతో సోషల్ మీడియాలో సినిమా విడుదల తేదీకి సంబంధించి విపరీతమైన చర్చ జరుగుతోంది. రెండు రోజులు ముందుగానే పండగ మొదలైదంటూ కొందరు అభిమానులు సంబరపడుతున్నారు. మరి కొందరు మాత్రం సినిమా విడుదల తేదీపై స్పష్టత ఇవ్వాల్సిందిగా చిత్ర బృందాన్ని కోరుతున్నారు. అయితే చిత్ర బృందం నుంచి మరోసారి అధికార ప్రకటన వెలువడితే తప్ప ఈ వార్తలో నిజమెంతో తెలియదు.
కాగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని.. అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. సుశాంత్, నివేతా పేతురాజ్, టబు, జయరామ్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మూవీ ‘మ్యూజికల్ కాన్సెర్ట్’ (ప్రీ రిలీజ్ వేడుక) జనవరి 6వ తేదీన యుసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్‌లో జరగనుంది.
#AlaVaikunthapurramuloo ❤🤩@alluarjun #Trivikram @hegdepooja @MusicThaman #Tabu #Jayaram #NivethaPethuraj @iamSushanthA @pnavdeep26 @Mee_Sunil #PSVinod @haarikahassine @vamsi84 @adityamusic pic.twitter.com/1WIYqvJQ6p
— Geetha Arts (@GeethaArts) December 31, 2019