వరల్డ్ సినిమాకి నార్త్... ఈస్ట్... వెస్ట్... సౌత్ | World Cinema to North ... East ... West ... South top Directors | Sakshi
Sakshi News home page

వరల్డ్ సినిమాకి నార్త్... ఈస్ట్... వెస్ట్... సౌత్

Published Fri, Aug 7 2015 11:27 PM | Last Updated on Sun, Sep 3 2017 6:59 AM

వరల్డ్ సినిమాకి నార్త్... ఈస్ట్... వెస్ట్... సౌత్

వరల్డ్ సినిమాకి నార్త్... ఈస్ట్... వెస్ట్... సౌత్

జేమ్స్ కామెరూన్, స్టీవెన్ స్పీల్‌బర్గ్, జాన్‌వూ, క్వెంటిన్ టెరెంటినో...
ఈ నలుగురూ ప్రపంచ సినిమాకి నాలుగు దిక్కులు. ఒకరు వెస్ట్ అయితే, ఇంకొకరు ఈస్ట్.
ఒకాయన సౌత్ అయితే, మరొకరు నార్త్.  నలుగురివీ నాలుగు మార్గాలు.
ఎవరు ఏ మార్గంలో నడిచినా ప్రపంచం మొత్తం వీరి సినిమాలంటే పడి చచ్చిపోతుంది.
అసలు ఈ నలుగురు జగదేక దర్శకులు ఇప్పుడేం చేస్తున్నారు? భవిష్యత్తులో ఎలాంటి అద్భుతాలు సృష్టించడానికి సిద్ధమవుతున్నారు?... జస్ట్ లుక్.

 
1. జేమ్స్ కామెరూన్ అవతార్!
‘టెర్మినేటర్’లో రోబోల విధ్వంసం ఎలా ఉంటుందో ఒళ్లు గగుర్పొడిచేలా చూపించాడు. ‘టైటానిక్’తో ప్రేక్ష కుల గుండెలు కరిగేలా చేశాడు.  ‘అవతార్’ సినిమాతో  అత్యున్నత సాంకేతిక అద్భుతాన్ని తెర మీద ఆవిష్కరించి, ‘అరె ఇలా కూడా సినిమా తీయొచ్చా’  అని వెండితెరకు సరికొత్త  గమనాన్ని నిర్దేశించిన దర్శకుడు జేమ్స్ కామెరూన్. ఆయన లేట్‌గా తీసినా లేటెస్ట్‌గా తీస్తాడని ప్రతీతి. ‘అవతార్’ తర్వాత ‘టైటానిక్-త్రీడీ’ వెర్షన్ కార్యకలాపాల్లో కొన్నాళ్లు నిమగ్నమైన కామెరూన్ ఇప్పుడేం చేస్తున్నట్టు? ప్రస్తుతం ఆయన ‘అవతార్’ సీక్వెల్స్ పనుల్లో చాలా చాలా బిజీగా ఉన్నారు.

‘అవతార్-2’, ‘అవతార్-3’ ఇలా వరుసగా సినిమాలు తీస్తానని ఆయన ఇంతకు ముందే ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే ‘అవతార్-2’ను సిద్ధం చేస్తున్నారు.  ఆ ‘అవతార్ ’ను మించిన కథాకథనాలు, గ్రాఫిక్స్ ఈ సీక్వెల్లో ఉంటాయట. అండర్‌వాటర్ సీక్వెన్సెస్  ‘అవతార్-2’లో  ప్రేక్షకులకు కనువిందు చేస్తాయని కామెరూన్ పేర్కొన్నారు. 2016లో ఈ చిత్రాన్ని విడుదల చేద్దామనుకున్నారు. అయితే, సాంకేతిక కారణాల వల్ల ఈ రెండో ‘అవతార్’ని 2017 డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారు.
 
2. స్పైస్ స్పీల్‌బర్గ్
‘జాస్’, ఈటీ (ఎక్స్‌ట్రా టెరస్ట్రియల్), ‘జురాసిక్ పార్క్’, ‘ద లాస్ట్ వరల్డ్’... ఈ సినిమాల పేర్లు  వింటే టక్కున గుర్తుకువచ్చే దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్. ఈ దిగ్దర్శకుని చిత్రాల కోసం ఎన్నేళ్లయినా ఎదురుచూసే అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో.  ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థలు స్టీవెన్‌తో కలిసి పనిచేయాలని ఇప్పటికీ  ఉవ్విళ్లూరుతుంటాయి. ఇటీవల వచ్చిన ‘జురాసిక్ వరల్డ్’ చిత్రానికి స్టీవెన్ స్పీల్‌బర్గ్ కేవలం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మాత్రమే.

ఈ చిత్రానికి ఆయన శిష్యుడు కొలిన్ ట్రావె ర్రో దర్శకత్వం వహించారు. కానీ టైటిల్ కార్డ్ మీద స్టీవెన్  స్పీల్‌బర్గ్ అనే పేరు మంత్రంలా పనిచేసి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది. ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా మూడో స్థానంలో నిలిచింది. మరి... స్పీల్‌బర్గ్  ఇప్పుడేం చేస్తున్నారు...? ఏ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు....? నిర్మాతగా ఫుల్ బిజీగా ఉంటూనే, ఆయన ఓ చిత్రాన్ని  తెరకెక్కిస్తున్నారు. అదే ‘బ్రిడ్జ్ ఆఫ్ స్పైస్’. టామ్ హ్యాంక్స్ ఇందులో హీరోగా నటిస్తున్నారు.

2016 అక్టోబర్  16న ఈ చిత్రం విడుదల కానుంది. ఈలోగా మరో చిత్రానికి కూడా సన్నాహాలు చేస్తున్నారాయన.. అదే ‘రెడీ ప్లేయర్ వన్’. ప్రముఖ హాలీవుడ్  నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఎర్నస్ట్ క్లయిన్ రాసిన ‘రెడీ ప్లేయర్ వన్’ అనే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ నవలను అదే పేరుతో తెరకెక్కించనున్నారు స్పీల్‌బర్గ్. ఈ చిత్రం 2017 డిసెంబర్ 15న తెర మీదకు రానుంది.
 
3. థ్రిల్లింగ్ మ్యాన్ జాన్ వూ
యాక్షన్ చిత్రాల స్పెషలిస్ట్‌గా ప్రపంచ సినీ అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన దర్శకుడు జాన్ వూ. ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను కట్టిపడేయడం జాన్ వూ ప్రత్యేకత. ‘ఫేస్ ఆఫ్’, ‘మిషన్ ఇంపాజిబుల్-2’, బ్రోకెన్ యారో, పే చెక్... ఈ చిత్రాలన్నీ ఆయన ప్రతిభకు తార్కాణాలు. 2008లో విడుదలైన ‘రెడ్ క్లిఫ్’, దానికి  సీక్వెల్‌గా విడుదలైన ‘రెడ్‌క్లిఫ్-2’, 1949  అంతర్యుద్ధం నేపథ్యంలో తీసిన  ‘క్రాసింగ్’, దీనికి సీక్వెల్ అయిన  ‘క్రాసింగ్-2’... ఇవన్నీ జాన్ వూ స్థాయిని పెంచాయి. 69 ఏళ్ల జాన్ వూ ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా? 1976లో విడుదలైన జపనీస్ థ్రిల్లర్  ‘మ్యాన్ హంట్’ చిత్రాన్ని  రీమేక్ చే సే సన్నాహాల్లో ఉన్నారు.
 
4. క్వెంటిన్ టెరెంటినో న్యూ డెఫినిషన్
వైవిధ్యమైన  సినిమాలకు కేరాఫ్ అడ్రస్ క్వెంటిన్ టొరెంటినో. ఎంత  పాత కథలనైనా ఇంత కొత్తగా కూడా చూపించవచ్చా అని ఆశ్చర్యపోయే స్థాయిలో స్క్రీన్‌ప్లేను కొత్త పుంతలు తొక్కించారీ దర్శకుడు. అయితే, ఆయన చిత్రాల్లో మితిమీరిన హింస, పోరాట సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయని విమర్శకుల వాదన. అయినప్పటికీ తన శైలిని మార్చుకోలేదు. ఎందుకంటే, ప్రేక్షకులు ఇష్టపడినవి ఇవ్వడమే తన ధ్యేయమని అంటారు క్వెంటిన్.

తన సక్సెస్ సీక్రెట్ అదే అంటారాయన. క్వెంటిన్ దర్శకత్వం వహించిన చిత్రాల్లో విజయాల శాతమే ఎక్కువ. ముఖ్యంగా ‘కిల్ బిల్’ సిరీస్, ‘ఇన్‌గ్లోరియస్ బాస్టర్డ్స్’, ‘ద జాంగో అన్‌చైన్డ్’... ఇలాంటి చిత్రాల ద్వారా క్రైమ్ థ్రిల్లర్స్‌కు సరికొత్త డెఫినిషన్ ఇచ్చారు. కొత్త దర్శకులు ఆయన్ను ఆదర్శంగా తీసుకుంటారు. ప్రస్తుతం క్వెంటిన్ ‘ద హేట్‌ఫుల్ ఎయిట్’ చిత్రాన్ని తెరకెక్కించే పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. డిసెంబరు 25న ఈ చిత్రం విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement