
అన్నిదానాల్లో కెల్ల విద్యాదానం గొప్పదంటారు.. వ్యక్తి ఉన్నతికి చదువే ఆయుధం అని గ్రహించిన ప్రవాస భారతీయులు పేద విద్యార్థులకు బాసటగా నిలుస్తున్నారు. కన్న నేలను, పెరిగిన గ్రామాన్ని మరవకుండా, సుదూర ప్రాంతంలో ఎంతోఎత్తులో ఉన్నా తమ ప్రాంతంలో విద్యాభివృద్ధికి కృషిచేస్తున్నారు. పాఠశాల, కళాశాలల భవనాలను నిర్మించి, మౌలిక కల్పిస్తూ, విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ నెల 9న ప్రవాసీ భారతీయ దివస్ సందర్భంగా విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న ఉమ్మడి జిల్లాలోని
ఎన్‌ఆర్‌ఐలపై ఈవారం వీకెండ్ స్పెషల్.
లాటా.. తెలుగు బాట
కోదాడఅర్బన్ : కోదాడ పట్టణానికి చెందిన ప్రవాస భారతీయుడు సాతులూరి శ్రీధర్ అమెరికాలోని లాస్‌ఏంజెల్‌లో నివాసముంటున్నాడు. 14ఏళ్ల కిత్రం ఉద్యోగరీత్యా వెళ్లిన శ్రీధర్ అక్కడే స్థిరపడ్డాడు. అక్కడ తెలుగు అసోసియేషన్‌ను స్థాపించి, వాటి కార్యకలాపాల నిర్వహణలో చురుకుగా పాల్గొంటున్నాడు. లాస్ ఏంజెల్‌లో తెలుగు అసోసియేషన్ (లాటా)కు రెండేళ్లు కార్యదర్శిగా పనిచేసిన ఆయన పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పలువురు ప్రముఖులను అక్కడికి ఆహ్వానించారు. ప్రస్తుతం లాటా బోర్డ్ ఆఫ్ డైరక్టర్‌గా ఎన్నికై రెండేళ్లుగా పదవిలో కొనసాగుతున్నాడు.
పాఠశాల ఏర్పాటు..
లాస్ ఏంజెల్‌లో స్థిరపడిన తెలుగువారి పిల్లలకు తెలుగు భాషను నేర్పేందుకు, వారు తెలుగులో పట్టు సాధించేందుకు పాఠశాలను స్థాపించాడు. వారాంతాలలో నిర్వహించే తరగతులకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గుర్తింపు కూడా ఉంది. ఈ పాఠశాలలో కోర్సులు పూర్తిచేసిన విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు కూడా అందజేస్తుండడం గమనార్హం.
అభివృద్ధికి విరాళాలు
అమెరికాలోనే కాక తన సొంత ప్రాంతంలో కూడా శ్రీధర్ సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడు. అక్కడ నివాసముండే తన సోదరి, సోదరుడి ద్వారా ఈ ప్రాంతంలోని మేళ్లచెర్వు మండలం రాఘవాపురంలోని ఆలయం, నేరేడుచర్ల మండలం కల్లూరులో దేవాలయాల అభివృద్ధికి విరాళాలు అందజేశాడు. మున్ముందు తన శక్తి మేర మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతానని శ్రీధర్ తెలిపాడు.
మంచికంటి దాతృత్వం
చండూరు(మునుగోడు): చండూరు మండలం బోడంగిపర్తి గ్రామానికి చెందిన డాక్టర్ మంచికంటి లక్ష్మయ్య 1976లో అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. తను సం పాదించిన దానిలో కొంత గ్రామానికి ఖర్చు చేయాలనే ఆలోచన, ఆనాడు కుటుంబ సభ్యులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాడు. 2003లో తన నాయనమ్మ మంచికంటి గోపమ్మ స్మారకార్థం కోటి రూపాయలతో గ్రామంలో పాఠశాల భవనాన్ని, తండ్రి మంచికంటి యాదగిరి స్మారకార్థం రెండు కోట్ల రూపాయలతో జూనియర్ కళాశాల భవనాన్ని నిర్మించాడు. పాఠశాలను ప్రభుత్వానికి అప్పజెప్పగా, జూనియర్ కళాశాలను మంచికంటి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా నడుపుతున్నారు. తాజాగా అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టారు.
ఎల్‌కేజీ నుంచి ఇంటర్ వరకు..
మంచికంటి నిర్మాణం చేసిన భవనంలోనే ప్రాథమిక, ఉన్నత, జూనియర్ కళాశాల నడుస్తోంది. ప్రభుత్వం ఉపాధ్యాయులను నియమించగా, 12 మంది విద్యావలంటీర్లను ట్రస్ట్ నియమించింది. ఎల్‌కేజీ నుంచి ఇంటర్ వరకు అంతా ఆంగ్ల మాధ్యమంలోనే ఉచితంగా బోధన చేస్తున్నారు. అంతేకాకుండా విద్యార్థులకు ఉచిత బస్సుపాస్‌ల సౌకర్యం, జూనియర్ కళాశాల విద్యార్థులకు ట్రస్ట్ ద్వారానే ఉచితంగా పుస్తకాలు అందిస్తున్నారు.
మెడిసిన్ చేయాలనుకునే వారికి చేయూత
మెడిసిన్ చేయాలనుకునే విద్యార్థులకు ట్రస్ట్ సహకారం అందిస్తుంది. ఇప్పటికే ఓ విద్యార్థిని మెడిసిన్ చదువుతుంది. మరో ముగ్గురు విద్యార్థులకు మెడిసిన్ కోసం కోచింగ్ ఇప్పిస్తున్నారు. పేద విద్యార్థులు మెడిసిన్ చేయాలనుకున్నవారు ట్రస్ట్‌ను సంప్రదిస్తే ఉచితంగా చదివిం చనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అంతేకాకుండా గ్రామంలో కూడా పలు సేవా కార్యక్రమాలు చేపట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment