సాక్షి, అలీఘర్ : యోగి ఆదిత్యానాథ్ నేతృత్వంలోని యూపీ క్యాబినెట్‌లో మరో మంత్రి వివాదంలో కూరుకుపోయారు. దళితులను పార్టీకి చేరువ చేసే కార్యక్రమంలో భాగంగా యూపీ మంత్రి దళితుని ఇంట భోజనం చేయాల్సి ఉండగా, క్యాటరర్ నుంచి తెప్పించిన భోజనం ఆరగించడంతో వివాదం నెలకొంది. యూపీ మంత్రి సురేష్ రాణా వివాదానికి కేంద్ర బిందువయ్యారు. అలీఘర్‌లోని లోహగఢ్‌లో సోమవారం రాత్రి మంత్రి రాణా ఓ దళిత సోదరుడి ఇంట వారి కుటుంబసభ్యులతో కలిసి విందు ఆరగించారు. అయితే ఆ తర్వాత విడుదలైన వీడియోల్లో మంత్రి ఆరగించిన విందు ముందుగా ఆర్డర్ ఇచ్చి తెప్పించినదని, దళిత కుటుంబం స్వయంగా వండివార్చింది కాదని వెల్లడైంది.
ఈ వీడియో క్లిప్ వైరల్‌గా మారడంతో మంత్రి రాణా ఇబ్బందుల్లో పడ్డారు. అయితే మంత్రి తమ ఇంటికి విందుకు వస్తున్నారని తనకు చివరి నిమిషం వరకూ తెలియదని..ఆహారం..మంచినీరు..పాత్రలు అన్నీ బయటనుంచి తెప్పించారని మంత్రికి ఆతిథ్యం ఇచ్చిన దళితుడు రజనీష్‌కుమార్ చెప్పారు. మంత్రితో పాటు పలువురు ఇతర బీజేపీ నేతలు రెస్టారెంట్ నుంచి తెప్పించిన విందు ఆరగిస్తూ వీడియోలో కనిపించారు. పనీర్ ఐటెమ్స్, దాల్‌మఖానీ, పులావ్, తండూరీ రోటీ, మినరల్ వాటర్ బాటిల్స్ టేబుళ్లపై కనిపించాయి. మంత్రి బృందమే వాటన్నింటినీ ఆర్డర్ చేసి తెప్పించిందని గ్రామస్థులు చెప్పారు. అయితే ఈ ఆరోపణలను మంత్రి రాణా తోసిపుచ్చారు. తన పర్యటన గురించి దళిత కుటుంబానికి సమాచారం ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment