
వాళ్ల కోసం లక్ష చపాతీలు
ప్రకృతి వైపరీత్యంతో సర్వం కోల్పోయి, అష్టకష్టాలు పడుతున్న బాధితులకు సుమారు లక్ష చపాతీలను పంచేందుకు సిద్ధమవుతున్నారు
బెంగళూరు: భారీవర్షాలు, వరదలతో అతలాకుతలమైన చెన్నై ప్రజలను ఆదుకునేందుకు బెంగళూరు ప్రజలు నిరంతరాయంగా శ్రమిస్తున్నారు. అష్టకష్టాలు పడుతున్న బాధితులకు లక్ష చపాతీలను పంచేందుకు సిద్ధమవుతున్నారు. శరవేగంగా చపాతీలు తయారు చేస్తూ తమ ఔదార్యాన్ని చాటుకున్నారు.
ఆపదలో ఉన్న పొరుగు రాష్ట్రాన్ని ఆదుకునేందుకు కర్ణాటక ఇప్పటికే తన సహాయాన్ని ప్రకటించింది. వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రూ. 5 కోట్ల ఆర్థిక సాయం చేస్తానంది. వరదల్లో చిక్కుకున్నవారిని ఆదుకునేందుకు బెంగళూరు వాసులు సోషల్ మీడియా ద్వారా వినూత్న సేవల్ని అందించారు. దీనికోసం వారు ఒక ప్రత్యేక వెబ్ సైట్ ను రూపొందించారు. దీంతోపాటు ట్విట్టర్, ఫేస్ బుక్ లో, సహాయానికి సంబంధించిన సమాచారం, తక్షణ సహాయాన్నందించే దాతల వివరాలు తదితర సమాచారాన్ని విరివిగా అందించారు.