
12 పసిప్రాణాలు బలి
► ఉత్తరప్రదేశ్‌లో లారీ, బస్సు ఢీ
►పొగమంచు, అతివేగం వల్లే..
ఎటా(ఉత్తరప్రదేశ్): ప్రతీరోజు లాగే ఆరోజు కూడా స్కూలు బస్సెక్కారు పిల్లలు. కానీ పాఠశాలకు చేరాల్సిన వారి గమ్యస్థానం ఆసుపత్రులకు, మార్చురీలకు చేరింది. ఎంతో సున్నితమైన చిన్నారుల శరీరాలు బస్సులో ఛిద్రమైపోయాయి. పాఠశాలలో ఆటపాటలతో కేరింతలు కొట్టాల్సిన వారు, భయంతో ఆర్తనాదాలు చేయాల్సి వచ్చింది. పొగమంచు, అతి వేగం, యాజమాన్య నిర్లక్ష్యం కలసి 12 మంది విద్యార్థుల ప్రాణాలను బలి తీసుకున్నాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎటా జిల్లాలోని అలీగంజ్–పాలియాలి రహదారిపై గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి చెందగా.. 20 మంది విద్యార్థులు గాయపడ్డారు.
మృతుల్లో 12 మంది బాలలు, బస్సు డ్రైవర్ ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చలి అత్యధికంగా ఉండటంతో పాఠశాలలకు సెలవివ్వాలన్న జిల్లా మేజిస్ట్రేట్ ఉత్తర్వులను ధిక్కరిస్తూ స్థానిక జేఎస్ విద్యానికేతన్ తరగతులు నిర్వహిస్తోంది. ఈ పాఠశాలకు చెందిన బస్సు 66 మంది చిన్నారులతో వెళు్తండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ఘటన కు పొగమంచు, అతి వేగమే కారణమని అధికారులు చెబుతున్నారు. మరణించిన విద్యార్థులంతా 5–15 ఏళ్ల విద్యార్థులు కావడంతో ఘటనా స్థలంలో, ఆస్పత్రిలో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ‘ఈ ఘటన తెలిసిన వెంటనే ఎంతో ఆవేదన చెందాను. చనిపోయి న బాలల కుటుంబాల బాధను నేనూ పంచుకుంటున్నాను. మృతి చెందిన చిన్నారులకు నివాళులు’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.