ఇదెక్కడి చోద్యం సగం పరికరాలు మాయం
న్యూఢిల్లీ: కామన్‌వెల్త్ క్రీడల సమయంలో ఢిల్లీ రవాణా సంస్థ (డీటీసీ)కి చెందిన బస్సులకు అమర్చిన గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్) పరికరాల్లో సగం ఇప్పుడు కనిపించడం లేదు. అప్పట్లో మొత్తం 3,700 బస్సులకు వీటిని అమర్చారు. డీటీసీ అధికారి ఒకరు అందించిన వివరాల ప్రకారం 2010లో వీటిని అమర్చారు. అందులో 1,800 లకు పైగా పరికరాలు కనిపించడం లేదు. కాగా ఇప్పుడివికాస్తా గల్లంతవడంతో బస్సులను సమర్థంగా నిర్వహించడంతోపాటు ఏ బస్సు ఏ సమయంలో ఎక్కడుందనే విషయం ప్రయాణికులకు తెలిసేవిధంగా చేయాలనే డీటీసీ లక్ష్యం కాస్తా దెబ్బతింది.
బస్సు సేవలను మెరుగుపరచాలనే లక్ష్యంతో 3,700 జీపీఎస్ పరికరాలను శీతల, శీత లేతర బస్సులకు అప్పట్లో బిగించారు. బస్సులు ఎక్కడ ఉన్నాయనే విషయం ప్రయాణికులకు తెలిసేందుకు వీలుగా అప్పట్లో నగరంలోని అనేక బస్టాండ్లలో ప్యాసింజర్ ఇన్‌ఫర్మేషన్ సిస్టంలను కూడా ఏర్పాటు చేశారు. ఇదిలాఉంచితే జీపీఎస్ పరికరాల గల్లంతుపై డీటీసీ పోలీసులకు ఫిర్యాదుచేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.
మరోవైపు డీటీసీ బస్సుల్లో ఇప్పటికేఉన్న జీపీఎస్ పరికరాలు పనిచేయడం లేదు. ఇటువంటివన్నీ జరగడానికి డ్రైవర్లే కారణమై ఉండొచ్చని ఓ అధికారి ఆరోపించారు. జీపీఎస్‌లు సరిగా పనిచేస్తే బస్సుల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలవుతుందని, ఇందుకోసం మిలీనియం డిపోలో కంట్రోల్ రూంనుకూడా ఏర్పాటు చేశామన్నారు. భారీ సంఖ్యలో జీపీఎస్ పరికరాలు మాయమవడం తమను ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు.