
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని బందీపురా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఐఏఎఫ్ కమాండోలు అమరులయ్యారు. సైన్యం జరిపిన కాల్పుల్లో ఇద్దరు లష్కరే తోయిబా(ఎల్‌ఈటీ) ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం అందడంతో బుధవారం హజీనా ప్రాంతంలో భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. తొలుత ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఇరు వర్గాల మధ్య ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. తమ శిక్షణలో భాగంగా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న ఇద్దరు ఐఏఎఫ్ గరుడ కమాండోలు గాయపడ్డారు.
వారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. అమరులైన కమాండోలను సార్జెంట్ మిలింద్ కిశోర్, కార్పొరల్ నీలేశ్ కుమార్‌గా గుర్తించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో హతమైన ఉగ్రవాదులు లష్కరేకి చెందిన అలీ అలియాస్ అబు మాజ్, నస్రుల్లా మీర్ అని పోలీసులు తెలిపారు. అలీది పాకిస్తాన్ కాగా మీర్ స్థానికుడేనని చెప్పారు. సంఘటనా స్థలంలో రెండు ఏకే రైఫిళ్లు, ఒక పిస్టోల్, 12 మేగజైన్లు, 75 రౌండ్ల మందుగుండు సామగ్రి లభ్యమయ్యాయి.
కానిస్టేబుళ్ల నుంచి ‘హిజ్బుల్’కు మందుగుండు
ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్‌కు మందుగుండు సామగ్రిని సరఫరా చేశారన్న ఆరోపణలపై కశ్మీర్‌లో ఇద్దరు కానిస్టేబుళ్లు అరెస్టయ్యారు. కానిస్టేబుళ్లు అహ్మద్ మాలిక్, నజీర్ అహ్మద్ రహస్యంగా 40 రౌండ్ల మందుగుండు సామగ్రిని అందజేసినట్లు పోలీసులు తెలిపారు. వీరితో పాటు హిజ్బుల్‌కు చెందిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.