కేటాయింపులు 26% పెంపు
మహిళా శిశు సంక్షేమం
గర్భిణులకు రూ.6 వేలు నేరుగా వారి ఖాతాల్లో జమ
గతేడాది రూ.17,640 కోట్లు
ఈ ఏడాది రూ.22,095 కోట్లు
న్యూఢిల్లీ: 2017–18 బడ్జెట్‌లో మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖకు 26శాతం నిధులు పెంచారు. గతేడాది రూ.17,640 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.22,095 కోట్లకు పెంచారు. ఇందిరా గాంధీ మంత్రిత్వ సహయోగ్ యోజనకు 2016–17 లో రూ.634 కోట్ల నిధులుండగా, ఈసారి నాలుగు రెట్లు పెంచి రూ.2,700 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద కాన్పు, టీకాల ఖర్చుల నిమిత్తం గర్భిణులకు రూ.6వేలు నేరుగా వారి బ్యాంకు ఖాతా ల్లో జమ చేస్తారు. ఇదివరకున్న ప్రసూతి లబ్ధి పథకం స్థానంలో కొత్తగా ఈ కార్యక్రమం అమలవుతుంది. ఈ పథకం గతంలో దేశవ్యాప్తంగా 53 జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఆర్థికమంత్రి జైట్లీ బడ్జెట్ ప్రసంగం సందర్భంగా.. కొత్తగా గ్రామీణ స్థాయిలో ‘మహిళా శక్తి కేంద్రాలు’ నెలకొల్పనున్నట్లు వెల్లడించారు.
ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 14 లక్షల ఐసీడీఎస్ అంగన్‌వాడీ కేంద్రాలకు రూ.500 కోట్ల నిధులు కేటాయించారు. ప్రధాని మోదీ మానస పుత్రిక ‘బేటీ బచావో–బేటీ పఢావో’ పథకానికి ఈ బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించారు. ఇది గతేడాదితో పోలిస్తే ఐదు రెట్లు ఎక్కువ. నిర్భయ నిధికి గతేడాదిలాగే ఈసారి కూడా రూ.500 కోట్లు ఇచ్చారు. 2013లో ప్రారంభమైన ఈ ఫండ్‌కు ఇప్పటిదాకా రూ.3 వేల కోట్లు మంజూరయ్యాయి. శిశు సంరక్షణ పథకానికి గతేడాది రూ.400 కోట్లుండగా, ఈసారి సమగ్ర శిశు వికాస పథకం కింద ఈ కార్యక్రమాన్ని కలిపేసి మొత్తంగా రూ.648 కోట్లు కేటాయించారు. అన్ని మంత్రిత్వ శాఖలలో మహిళా శిశు సంక్షేమానికి సంబంధించి 2016–17లో రూ.1,56,528 కోట్లుగా ఉన్న నిధులను 2017–18 ఆర్థిక సంవత్సరానికి రూ.1,84,632 కోట్లకు పెంచినట్లు అరుణ్ జైట్లీ పేర్కొన్నారు.