
ప్రధాని నరేంద్రమోదీ నియోజకవర్గం వారణాసి కూడా ఈ జాబితాలో ఉండటం..
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత కాలుష్యమైన నగరంగా ఢిల్లీ వార్తల్లోకెక్కిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఢిల్లీని వెనక్కు నెట్టి మూడు నగరాలు అత్యంత కాలుష్యమైన నగరాలుగా ముందు వరుసలో నిలిచాయి. మొదటి రెండు నగరాలు బీహార్ రాజధాని పాట్నా, కాన్పూర్‌లు కాగా ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గం వారణాసి కూడా ఈ జాబితాలో ఉండటం గమనార్హం. ఐఐటీ కాన్పూర్, శక్తి ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
ఈ మూడు నగరాలలో 2018 సంవత్సరానికి గానూ అక్టోబర్- నవంబర్ మధ్య కాలంలో గాలి నాణ్యత సూచీ(పీఎమ్) 2.5ను తాకినట్లు సర్వే వెల్లడించింది. ఈ మూడు నగరాల గాలి నాణ్యత ప్రమాదకరస్థాయికి క్షీణించిందని తెలిపింది. ఇండియా అధిక జనాభా కలిగిన చైనా కంటే యాభై శాతం అధికంగా గాలి కాలుష్యంతో ఇబ్బందులు పడుతోందని ఈ సర్వే పేర్కొంది. ప్రభుత్వాలు దీర్ఘకాలం ఈ సమస్యలను పట్టించుకోకపోవటమే దీనికి కారణమని తెలిపింది. అయితే ప్రభుత్వాలు మాత్రం చలికాలం కాబట్టి గాలిలో కాలుష్యం పెరిగిపోయిందనటం గమనార్హం.