వుహాన్‌లో రోగులంతా డిశ్చార్జ్ కావడంతో ఖాళీగా ఉన్న తాత్కాలిక ఆస్పత్రి
న్యూఢిల్లీ: కేరళలో మూడేళ్ల చిన్నారి సహా నలుగురికి తాజాగా కరోనా వైరస్ సోకడంతో ఈ మహమ్మారి బారిన పడ్డవారి సంఖ్య 44కు చేరింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, జమ్మూలలో ఒక్కో కేసు నమోదు కాగా.. ఇటీవల ఇటలీ నుంచి తిరిగి వచ్చిన మూడేళ్ల చిన్నారి వ్యాధి బారిన పడినట్లు ఆర్యోగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. న్యూయార్క్ నుంచి బెంగళూరుకు వచ్చిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగికీ కోవిడ్ సోకింది. జమ్మూలో కోవిడ్ బారిన పడ్డ వ్యక్తి ఇరాన్‌కు వెళ్లినట్లు తెలిసిందని, ఉత్తర ప్రదేశ్ బాధితుడు కరోనా వైరస్ సోకిన ఆరుగురితో ఆగ్రాలో సన్నిహితంగా గడిపారని ఆరోగ్య శాఖ తన ప్రకటనలో వివరించింది. మరోవైపు రాజధాని ఢిల్లీలో మరో కేసు నమోదైన నేపథ్యంలో ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్.. సీఎం కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌లతో ఓ సమీక్ష సమావేశం నిర్వహించారు.
‘వైరస్ నియంత్రణపై అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు పంపిస్తున్నాం’అని మంత్రి తెలిపారు. 8255 విమానాల్లోని 8.74 లక్షల అంతర్జాతీయ ప్రయాణీకులకు స్క్రీనింగ్ పరీక్షలు చేశారు. కేరళలోని కోచీలో వైరస్ బారిన పడ్డ మూడేళ్ల చిన్నారి రెండు రోజుల క్రితమే తల్లిదండ్రులతో కలిసి ఇటలీ నుంచి వచ్చింది. వైరస్ భయాందోళనలు ఎలా ఉన్నా కేరళలో మంగళవారం నాటి ఆటుక్కళ పొంగలలో లక్షలాది మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొనడం గమనార్హం. కర్ణాటకలో మొదటి కోవిడ్ కేసు వెలుగుచూసింది. అమెరికా నుంచి బెంగళూరుకు వచ్చిన 40ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి కోవిడ్ సోకిందని రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి సుధాకర్ తెలిపారు. మార్చి 1న భార్య, కుమార్తెతో న్యూయార్క్ నుంచి బెంగళూరుకు ఆ ఉద్యోగి వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment