ఆ 39 మంది జైల్లో ఉన్నారేమో!: సుష్మ
న్యూఢిల్లీ: ఇరాక్‌లో మూడేళ్ల క్రితం ఐసిస్ ఉగ్రవాదులు అపహరించిన 39 మంది భారతీయులు ప్రస్తుతం బుదుష్‌లోని జైల్లో ఉండే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చెప్పారు. ఈ నెల 24న ఇరాక్ విదేశాంగ మంత్రి భారత పర్యటనకు రానున్నారనీ, ఆ 39 మంది గురిం ఏదైనా కొత్త సమాచారం ఇచ్చే అవకాశం ఉందని ఆమె అన్నారు.
అపహరణకు గురైన వారి కుటుంబ సభ్యులతో సుష్మ ఆదివారం మాట్లాడారు. తూర్పు మోసుల్‌ను ఐసిస్ నుంచి ఇరాక్ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న వెంటనే విదేశాంగ సహాయ మంత్రి వీకే సింగ్‌ను అక్కడికి పంపించి 39 మంది గురించి ఆరా తీయించామని సుష్మ వెల్లడించారు. అక్కడి అధికారుల సమాచారం ప్రకారం తొలుత వారిని ఐసిస్ ఓ వైద్యశాల నిర్మాణ పనిలో పెట్టిందనీ, అనంతరం తోటలోకి మార్చారనీ, అక్కడి నుంచి బదుష్ జైలుకు తీసుకెళ్లారని పేర్కొన్నారు.