‘వన్ పెన్షన్’ వచ్చేసింది | 5 Key Points of One Rank One Pension Announcement | Sakshi
Sakshi News home page

‘వన్ పెన్షన్’ వచ్చేసింది

Published Sun, Sep 6 2015 1:58 AM | Last Updated on Sun, Sep 3 2017 8:48 AM

‘వన్ పెన్షన్’ వచ్చేసింది

‘వన్ పెన్షన్’ వచ్చేసింది

 ఒక ర్యాంకు- ఒక పెన్షన్ అమలుకు కేంద్రం ఓకే
  ఐదేళ్లకోసారి పెన్షన్ మొత్తం సవరణ.. వీఆర్‌ఎస్ తీసుకున్నవారికి వర్తింపు లేనట్లే
  2013 ఆధారంగా గరిష్ట, కనిష్ట పెన్షన్ మొత్తాల సగటు కనీస పెన్షన్‌గా నిర్ధారణ
  ఏటా రూ.10వేల కోట్ల వరకూ భారం.. 2014 జూలై నుంచే వర్తింపు.. రూ.12వేల కోట్ల వరకు బకాయిలు.. ఆర్నెల్లకోసారి నాలుగు వాయిదాల్లో బకాయిల చెల్లింపు
  పథకం అమలుపై ఏక సభ్య న్యాయ కమిటీ.. ఆర్నెల్లలోగా నివేదిక
  ప్రతిపాదనపై పెదవి విరిచిన మాజీ సైనికులు.. రెండేళ్లకోసారి పెన్షన్ సవరించాల్సిందే
 చాలా అంశాల్లో స్పష్టత అవసరం.. ఆందోళన కొనసాగిస్తాం

 
 న్యూఢిల్లీ:  మాజీ సైనికులకు ‘ఒకే ర్యాంకు-ఒకే పెన్షన్’(ఓఆర్‌ఓపీ) అంశంపై ఎట్టకేలకు ముందడుగు పడింది. దీనిని త్వరలోనే అమల్లోకి తీసుకువస్తామని.. 2014 జూలై నుంచే వర్తింపజేస్తామని కేంద్రం శనివారం ప్రకటించింది. కానీ మాజీ సైనికులు డిమాండ్ చేస్తున్నట్లుగా పెన్షన్‌ను రెండేళ్లకోసారి కాకుండా ఐదేళ్లకోసారి సవరిస్తామని పేర్కొంది. మరోవైపు కేంద్రం ప్రకటనపై మాజీ సైనికులు పెదవి విరిచారు. అందులోని పలు అంశాలు తమ డిమాండ్లకు విరుద్ధంగా ఉన్నాయని... ఈ అంశంపై తమ ఆందోళన కొనసాగుతుందని ప్రకటించారు. ఈ ఓఆర్‌ఓపీ అమల్లోకి వస్తే దాదాపు 26 లక్షల మంది రిటైర్డ్ సైనికులు, సిబ్బంది, వారి కుటుంబాలకు ప్రయోజనం కలుగనుంది. మాజీ సైనికులకు ఓఆర్‌ఓపీని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ శనివారం ప్రకటించారు.
 
  ‘భారీ ఆర్థిక భారం పడుతున్నా.. మాజీ సైనికుల ప్రయోజనం కోసం దీనిని అమల్లోకి తీసుకొస్తున్నాం.  దీనికోసం మాజీ సైనికులు 40 ఏళ్లుగా పోరాడుతున్నా.. ఇప్పుడు మా ప్రభుత్వమే అమల్లోకి తెచ్చింది. జూలై 2014 నుంచే దీనిని అమలు చేస్తాం. పెన్షన్‌ను ఐదేళ్ల కోసారి సవరిస్తాం. ఇందుకు 2013 ఏడాదిని బేస్ ఇయర్‌గా తీసుకుంటాం. ఒకే సర్వీసు, ఒకే హోదా ఉన్నవారి గరిష్ట, కనిష్ట పెన్షన్ల సగటును కనీస పెన్షన్ మొత్తంగా నిర్ణయిస్తాం. అయితే దీనితో పోలిస్తే ఎక్కువ పెన్షన్ ఉన్నవారికి అది యథాతథంగానే కొనసాగుతుంది’ అని వివరించారు. ఇక స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన మాజీ సైనికులకు ఇది వర్తించబోదన్నారు. ఈ ఓఆర్‌ఓపీ అమలుపై ఏక సభ్య న్యాయ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని... ఆ కమిటీ 6నెలల్లో తమ నివేదికను సమర్పిస్తుందని చెప్పారు.
 
 ఈ పథకాన్ని అమలు కేవలం పరిపాలనా పరమైన నిర్ణయం కాదని... దీని వల్ల రూ.8,000 కోట్ల నుంచి రూ.10,000 కోట్ల వరకు భారం పడుతుందని అంచనా వేస్తున్నట్లు  తెలిపారు. చెల్లించాల్సిన బకాయిలు సుమారు రూ.10వేల కోట్ల నుంచి రూ.12 వేల కోట్ల వరకు ఉంటాయన్నారు. ఈ బకాయిలను ఆరు నెలలకోసారి చొప్పున నాలుగు వాయిదాల్లో చెల్లిస్తామని.. అదే వితంతువులకు మాత్రం ఒకేసారి మొత్తం బకాయిలు చెల్లిస్తామని చెప్పారు. కాగా రక్షణ దళాల అనుమతితో, చట్టబద్ధంగా వీఆర్‌ఎస్ తీసుకున్నవారికి ఓఆర్‌ఓపీ ప్రయోజనాలు అందుతాయని సమాచార, ప్రసారశాఖ మంత్రి రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్ చెప్పారు. ఇక ఈ పెన్షన్ విధానం అమలు చాలా క్లిష్టమైన విషయమని, ఇందుకోసం వివిధ సమయాల్లో, వివిధ ర్యాంకుల్లో రిటైరైన సైనికులకు కలిగే ప్రయోజనాలను పరిశీలించాల్సి ఉంటుందని రక్షణశాఖ వర్గాలు పేర్కొన్నాయి. పూర్తి వివరాలతో కూడిన ఉత్తర్వులు వచ్చే నెలలో జారీ అయ్యే అవకాశముందని వెల్లడించాయి. వీఆర్‌ఎస్ తీసుకున్న వారికి పెన్షన్ వర్తింపుపై ప్రభుత్వం రెండు మూడు రోజుల్లో స్పష్టత ఇచ్చే అవకాశముంది.
 
 ఎన్డీఏ నమ్మక ద్రోహం: కాంగ్రెస్
 ఎన్డీఏ ప్రభుత్వం మాజీ సైనికులకు నమ్మకద్రోహం చేసిందని.. శనివారం ప్రకటించిన ఓఆర్‌ఓపీలోని చాలా అంశాలు వారి ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని కాంగ్రెస్ మండిపడింది. ఎన్డీఏ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని ఆ పార్టీ సీనియర్ నేత, రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ విమర్శించారు. వీఆర్‌ఎస్ తీసుకున్న వారికి వర్తింపజేయబోమనడం దారుణమని.. అసలు సైనికుల్లో 90 శాతం మంది 35 నుంచి 40 ఏళ్ల మధ్యే రిటైర్ అవుతారని పేర్కొన్నారు. యూపీఏ హయాంలోనే ‘వన్ పెన్షన్’ను తాము అమల్లోకి తెచ్చామని, ఎన్డీఏ సర్కారే తొలిసారిగా తెచ్చినట్లుగా రక్షణ మంత్రి చెప్పుకొంటున్నారని విమర్శించారు. ఓఆర్‌ఓపీపై కేంద్రం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని బీజేపీ చీఫ్ అమిత్‌షా వ్యాఖ్యానించారు.
 
 ఆందోళన విరమించాలి: వెంకయ్యనాయుడు
 ఓఆర్‌ఓపీ అమలుకు కేంద్రం ముందుకొచ్చినందున మాజీ సైనికులు ఆందోళనను విరమించాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విజ్ఞప్తి చేశారు. అసంతృప్తి ఉంటే చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.
 
  ఒప్పుకోం: మాజీ జవాన్లు
 ఓఆర్‌ఓపీ అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని ఈ అంశంపై ఉద్యమిస్తున్న మాజీ సైనికుల నాయకుడు, రిటైర్డ్ మేజర్ జనరల్ సత్‌బీర్ సింగ్ పేర్కొన్నారు. కానీ దీని అమల్లో ప్రభుత్వం ప్రతిపాదించిన అంశాలు తమకు ఆమోదయోగ్యం కాదని ఆయన  స్పష్టం చేశారు. ‘ఐదేళ్లకోసారి పెన్షన్‌ను సమీక్షిస్తామన్న నిర్ణయం ఆమోదయోగ్యం కాదు.  వీఆర్‌ఎస్ తీసుకున్న వారికి కూడా ఈ పథకం వర్తింపజేస్తామని ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇస్తేనే నిరవధిక నిరాహారదీక్ష విరమిస్తాం. ఏకసభ్యకమిటీ ఏర్పాటుకు కూడా అంగీకరించేది లేదు. మొత్తం ఐదుగురు సభ్యులతో కమిటీ వేయాలి. ఇందులో ముగ్గురు మాజీ సైనికోద్యోగులు, ఒక ప్రస్తుత సైనికోద్యోగి, ఒక ప్రభుత్వ ప్రతినిధి కేంద్ర రక్షణ మంత్రి పరిధిలో ఉండాలి. ఈ కమిటీకి కాలపరిమితిని ఆరు నెలలు కాకుండా ఒక నెల మాత్రమే ఇవ్వాలి. పెన్షన్‌ను లెక్కించటానికి సగటున అత్యధిక పెన్షన్ వస్తున్న పెన్షనర్‌ను ప్రామాణికంగా తీసుకోవాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.
 
 వివాదానికి ఆజ్యం పోసిన ఇందిర
 ఓఆర్‌ఓపి వివాదానికి మూలం ఇప్పటిదేం కాదు.. 1973లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ సృష్టించిన వివాదం ముదిరి మోదీని చుట్టుకుంది.  మూడో పే కమిషన్ నివేదికతో ఓఆర్‌ఓపీని రద్దు చేస్తూ ఇందిర తీసుకున్న నిర్ణయంతో ఓఆర్‌ఓపీకి ఆజ్యం పోసినట్లయింది. ఇందిర  తర్వాతి ప్రభుత్వాలన్నీ ఈ అంశాన్ని పెండింగ్‌లో పెడుతూనే పోయాయి. ఒకే ర్యాంకు, ఒకే సర్వీసు కాలం ఉండి.. గతంలో రిటైర్ అయిన, ప్రస్తుతం రిటైర్ అవుతున్న.. భవిష్యత్తులో రిటైర్ కాబోతున్న వారికి ఒకేరకమైన పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నది సైనికోద్యోగుల డిమాండ్. దాదాపు 26 లక్షల మంది మాజీ సైనికోద్యోగులు ఉండటంతో  వివాదం పరిష్కారానికి నోచుకోకుండా ఏళ్లూపూళ్లూ గడిచిపోయాయి. ఒక ఆర్మీ ఆఫీసర్ లేదా జవాను 1973లో రిటైర్ అయినా.. 2010లో రిటైర్ అయినా ఇద్దరికీ ఒకే పెన్షన్ రావాలన్నది ప్రధాన డిమాండ్. ఒక ఆర్మీ అధికారి 20 ఏళ్లు సర్వీసు పూర్తి చేసి రిటైర్ అయితే, చివరగా తీసుకున్న వేతనంలో 50శాతం పింఛన్ లభిస్తోంది.
 
 అయితే.. అంతకు ముందు ఇంతే సర్వీసు పూర్తి చేసి ఇదే ర్యాంకులో రిటైర్ అయిన అధికారికి మాత్రం చాలా తక్కువ  వస్తోంది. ఈ రెంటినీ ఒకటి చేయాలన్న డిమాండ్‌కు ప్రభుత్వం ఇంతకాలానికి అంగీకరించింది. సైనికోద్యోగుల్లో 98 శాతం మంది 54ఏళ్ల లోపు రిటైర్ అవుతున్నారు. వీరిలో 85శాతం మంది 35-37 ఏళ్ల మధ్య స్వచ్ఛంద పదవీవిరమణ చేస్తున్నారు. 40-54 ఏళ్ల మధ్య రిటైరవుతున్న వారి శాతం 13 శాతానికి మించి ఉండటం లేదు. పెన్షన్ విషయంలో వీరు మాత్రమే ఎక్కువ లబ్ధి పొందుతున్నారు. వీఆర్‌ఎస్ తీసుకున్న వారికి ఓఆర్‌ఓపీ వర్తించదని ప్రభుత్వం తొలుత ప్రకటించటంతో సైనికోద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే చట్టసమ్మతంగా వీఆర్‌ఎస్ తీసుకున్నవారికి వర్తిస్తుందని కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్ అన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement