ఆవు ప్లస్ ఆ నలుగురు
న్యూఢిల్లీ: సమాజంలో మంచికైనా, చెడుకైనా సంచలనం సృష్టించిన అంశాలు ఈ ఏడాది ప్రధానంగా ఐదు ఉన్నాయి. అందులో ఆవు అంశం ఒకటి. హిందువుల ఆరాధించే ఆవు మాంసాన్ని ఎవరూ కలిగి ఉండరాదని, తినకూడదని, అలా చేస్తే పదేళ్లు జైలు శిక్ష విధిస్తామంటూ మహారాష్ట్రలోని బీజేవీ ప్రభుత్వం కఠిన చట్టాన్ని తీసుకొచ్చి సంచనలం సృష్టించింది. అదే తరహాలో హర్యానా కూడా కఠిన చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టాలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించడమే కాకుండా దేశవ్యాప్తంగా పలువురు ముస్లింల హత్యలకు దారి తీశాయి.
ఉత్తరప్రదేశ్‌లోని దాద్రిలో ఓ ముస్లిం కుటుంబం ఆవు మాంసం భద్రపర్చారనే మిషతో ఆ ఇంటిమీద కొంత మంది దాడులు జరిపి ఇంటి యజమానిని కొట్టి చంపారు. మరోచోట ఆవులను ఎత్తుకుపోతున్నారన్న ఆరోపణలతో ఓ ట్రక్కు డ్రైవర్‌ను హతమార్చారు. ఆవు మాంసం వడ్డిస్తున్నారన్న ఫిర్యాదుపై ఢిల్లీలోని కేరళ హౌస్‌పై ఢిల్లీ పోలీసులు దాడులు జరిపారు. దీనిపై రాజకీయ దుమారం కూడా రేపింది. ఇది చివరకు దేశంలో అసహనం పెరిగిపోతోందన్న ఆందోళనకు దారితీసింది.
రెండో అంశం షీనా బోరా
24 ఏళ్ల షీనా బోరా హత్య కేసు. మూడేళ్ల క్రితం జరిగిన ఆమె హత్య కేసు రోజుకో మలుపుతిరుగుతూ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మీడియాకు ప్రధాన కథాంశంగా మారింది. ఈ కేసులో అరెస్టయిన ఇందిరాణి ముఖర్జీ చుట్టూ పలు కథనాలు వెలువడ్డాయి. ఊహంచని విధంగా గత నవంబర్ మారు తండ్రి, మీడియా బిగ్‌విగ్ పీటర్ ముఖర్జీ కూడా అరెస్టయ్యారు. 500 నుంచి 600 కోట్ల రూపాయల లావా దేవీలకు సంబంధించిన ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ముంబై పోలీసు కమిషనర్ రాకేశ్ మారియా బదిలీ అవడంతో కేసు దర్యాప్తు బలహీనపడినట్టు కనిపిస్తోంది. ఏదే మైనా వార్తలపరంగా ఈ కేసు 2015 సంవత్సరానికి ‘గాసిప్ ఇయర్’ అన్న పేరును తెచ్చింది.
మూడో అంశం హార్థిక్ పటేల్
హార్థిక్ పటేల్ కూడా ఈ ఏడాది దేశంలో సంచలనం సృష్టించారు. వ్యాపారంలోనూ వ్యవసాయంలోనూ రాణిస్తున్న పటేళ్ల వర్గానికి బీసీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని చేపట్టిన పటేల్ అనతి కాలంలోనే ఏ రాజకీయ నాయకుడికిరానంత పేరు తెచ్చుకున్నారు. నాలుగైదు లక్షల మందితో ర్యాలీ నిర్వహించి ప్రభుత్వం గుండెల్లో గుబులు పుట్టించారు. సోషల్ మీడియాలో కూడా హీరో అనిపించుకున్నారు. అయితే, ఎంత వేగంగా హీరో అయ్యారో, అంతేవేగంగా జీరో అయ్యారు. ఇది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే!
మహేశ్ శర్మ
ఆరెస్సెస్‌లో సుదీర్ఘకాలంగా సభ్యుడిగా ఉన్న డాక్టర్ మహేశ్ శర్మ ఊహించని విధంగా మంత్రిపదవి దక్కించుకొని చ ర్చల్లో వ్యక్తి అయ్యారు. లోక్‌సభకు మొదటిసారి ఎన్నికైన ఆయన సాంస్కృతిక, పర్యాటక శాఖ సహాయ మంత్రిగా స్వతంత్య్ర బాధ్యతలు నిర్విహ స్తూ ‘దాద్రి’ సంఘటనలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా సంచలనం సృష్టించారు. దాద్రి సంఘటన యాదృశ్ఛికంగా జరిగిందే తప్పా ఎవరు ఉద్ధేశపూర్వకంగా చేసింది కాదంటూ ప్రభుత్వానికి అండగా నిలబడ్డారు. ఎవరినైనా కొడితే శరీరానికే గాయాలవుతాయని, ఆవును చంపితే మాత్రం మనిషిలోని గుండెకాయకు గాయం అవుతుందనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాజీ రాష్ట్రపతిగా అబ్దుల్ కలాంకు కేటాయించిన బంగాళాను దక్కించుకోవడం ద్వారా కూడా శర్మ సంచలనం సృష్టించారు. మొదటిసారి ఎంపీ అయినావారెవరికి ఇలాంటి బంగళాను కేటాయించిన చరిత్ర దేశంలో లేదు.
పహ్లాజ్ నెహ్లాని
2015, జనవరిలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) చైర్మన్‌గా నియమితులైన పహ్లాజ్ నెహ్లాని తన వివాదాస్పద నిర్ణయాలతో సంచలనం సృష్టించారు. బాంబే అనే పదంతోపాటు 13 ఆంగ్ల పదాలను, 11 హిందీ పదాలను సినిమాల్లో వాడకూడదంటూ నిషేధం విధించారు. ఇటీవల వచ్చిన జేమ్స్ బాండ్ చిత్రం ‘స్పెక్టర్’ చిత్రంలో ముద్దు సీన్‌ను కుదించారు. ఎందుకు ఇలా చేశారంటూ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్లు ప్రశ్నించగా ‘మీరు ఇంట్లో తలుపులు తెరచుకొని అందరికి కనపడేలా సెక్స్‌లో పాల్గొంటారా?’ లాంటి వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనం సృష్టించారు.