ప్రతి పదిమందిలో ఆరుగురు వాళ్లే..
న్యూఢిల్లీ: భారతదేశంలో డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోవడం చాలా సులభం. దేశంలో ప్రతి 10మందిలో ఆరుగురు డ్రైవింగ్ పరీక్ష ఎదుర్కోకుండానే డ్రైవింగ్ లైసెన్స్ పొందుతున్నారు. దేశంలో మెట్రో నగరాలతోపాటు, అత్యధిక వాహన రద్దీ ఉన్న నగరాల్లో ఈ సంఖ్య మరీ ఎక్కువగా ఉందని ఓ సర్వే సంస్థ తెలిపింది. దేశంలో ఆగ్రాలో కేవలం 12శాతం మంది మాత్రమే నిజాయితీగా లైసెన్స్‌ను తీసుకుంటున్నారు. మిగతా 88శాతం అక్రమంగా లంచాల ద్వారా పొందుతున్నారు. జైపూర్‌లో 72శాతం, గౌహతిలో 64శాతం, ఢిల్లీలో 54శాతం, ముంబై నగరంలో 50 శాతం మంది. ఇలా అక్రమంగా లైసెన్స్ పొందుతున్నారు. సేవ్ లైఫ్ ఫౌండేషన్ నిర్వహించిన సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
దేశంలో మెత్తం 997 రీజనల్ ట్రాన్సపోర్ట్ కార్యాలయాలు ఉన్నాయి. ప్రతి ఏడాది సుమారు 1.15 కోట్ల రెన్యువల్, కొత్త డ్రైవింగ్ లైసెన్స్‌లు జారీ చేస్తున్నాయి. ప్రతి కార్యాలయంలో ప్రతిరోజు సుమారు 40 నుంచి 130 వరకూ మంజూరు చేస్తున్నాయని సర్వేలో తేలింది. ఆర్టీఎ కార్యాలయాలు అన్నీ అవినీతితో నిండిపోయాయని వెల్లడించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఒక అధికారి రోజుకు 15 నుంచి 20 మాత్రమే జారీ చేయాలి. కానీ 130-150 లైసెన్స్‌లను జారీ చేస్తున్నారు. దీంతో నైపుణ్యంలేని డ్రైవర్లు రోడ్లపైకి వచ్చి ప్రమాదాలకు కారకులు అవుతున్నారు. దేశంలో 80శాతం మంది రోడ్డు సురక్షితం కాదని, 82 శాతం మంది పాదాచారులు రోడ్డు దాటడం పట్ల అభద్రతా భావంతో ఉన్నారు.