గ్యాంగ్ రేప్, హత్య కేసులో ఏడుగురికి ఉరిశిక్ష
రోహ్టక్: మానసిక వికలాంగురాలిని (28) సామూహిక అత్యాచారం చేసి, కిరాతకంగా హత్య చేసిన కేసులో ఏడుగురు దోషులకు ఉరిశిక్ష పడింది. దోషులకు ఒక్కొక్కరికీ 1.75 లక్షల రూపాయల చొప్పున జరిమానా విధించారు. సోమవారం హరియాణాలోని రోహ్టక్ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఈ కేసులో పరారైన ఎనిమిదో నిందితుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ కేసులో తొమ్మిదో నిందితుడిగా ఉన్న బాలనేరస్తుడు జువెనైల్ కోర్టును ఆశ్రయించాడు.
నేపాల్కు చెందిన బాధితురాలు రోహ్టక్లోని తన సోదరి ఇంట్లో ఉండేది. ఈ ఏడాది ఫిబ్రవరి 1న ఆమె అదృశ్యమైంది. అదే నెల 4న బహు అక్బర్పూర్ గ్రామంలో ఆమె శవమైతేలింది. ఆమెను సామూహిక అత్యాచారం చేసి అతికిరాతకంగా హత్య చేసినట్టు పోస్టుమార్టమ్ నివేదికలో వెల్లడైంది. ఆమె శరీరమంతా తీవ్ర గాయాలయ్యాయని, శరీరంలోపల రాళ్లు ఉన్నట్టు తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. నేరం చేసినట్టు నిందితులు అంగీకరించారు. ఆమెపై లైంగికదాడికి పాల్పడిన తర్వాత అపస్మారకస్థితిలోకి వెళ్లిందని, తాము ఇటుకలతో ఆమె మర్మాంగాలపై దాడి చేసినట్టు విచారణలో నిందితులు చెప్పారు. మద్యంమత్తులో విచక్షణరహితంగా ప్రవర్తించామని, ఎందుకు అలా చేశామో తెలియదని ఓ నిందితుడు చెప్పాడు.