
న్యూఢిల్లీ: ఆధార్ సమాచార లీకేజీ ఎన్నికల ఫలితాల్ని ప్రభావితం చేయగలదని, ప్రజాస్వామ్య అస్థిత్వానికే తీవ్ర ముప్పు కలుగుతుందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వ్యక్తిగత సమాచారం ఉల్లంఘనకు గురవుతోందన్న భయాందోళనలు సహేతుకమేనని పేర్కొంది. సమాచార భద్రతకు పటిష్టమైన చట్టం లేని పక్షంలో అలాంటి ఆందోళనలను తేలిగ్గా తీసుకోలేమంది. ఆధార్ చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ మంగళవారం కొనసాగింది.
ఆధార్ ధ్రువీకరణ చేపడుతున్న సంస్థల నుంచి వ్యక్తుల సమాచారం బయటకు పొక్కే ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ‘డేటా అనలిటికా లీక్ చేసిన సమాచారంతో ఇతర దేశాల ఎన్నికలు ప్రభావితమయ్యాయి. మనం నివసిస్తున్న ప్రపంచంలో ఇలాంటి సమస్యలు సర్వ సాధారణమయ్యాయి’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఫేస్‌బుక్, గూగుల్ మాదిరిగా వినియోగదారుల సమాచారాన్ని విశ్లేషించే అల్గారిథమ్ యూఐడీఏఐ వద్ద లేదని ఆధార్ ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) తరఫున లాయర్ రాకేశ్ ద్వివేది తెలిపారు.
ఆధార్ ధ్రువీకరణ చేసేందుకు ప్రైవేట్ సంస్థలకు ఎందుకు అనుమతిస్తున్నారని కోర్టు అడిగిన ప్రశ్నకు ద్వివేది బదులిస్తూ.. ‘టీ , పాన్ అమ్మకందారుల వంటి చిన్నాచితకా వ్యాపారులు ఆధార్ వివరాలు కోరలేరు. ఆధార్ ధ్రువీకరణను కోరే సంస్థల ఉద్దేశాలు, కార్యకాలపాల పట్ల యూఐడీఏఐ సంతృప్తి చెందితేనే వాటికి ఆ అవకాశం దక్కుతుంది’ అని అన్నారు. చట్టంలో పౌరుల సమాచార భద్రతకు తగిన జాగ్రత్తలు తీసుకున్నామని, డేటా చౌర్యానికి పాల్పడే వారికి కఠిన శిక్షలు ప్రతిపాదించారని తెలిపారు. బయోమెట్రిక్ వివరాల్లోకి ఇతరులు చొరబడేందుకు అవకాశాల్లేవని, ఆధార్ తక్షణ ధ్రువీకరణకే వాటిని వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. అసంపూర్తిగా ముగిసిన ఈ విచారణ బుధవారం కొనసాగనుంది.