సాక్షి, న్యూఢిల్లీ : 2016-17 ఆర్థిక సంవత్సరంలో అన్ని ప్రాంతీయ పార్టీల కంటే శివసేనకు అత్యధిక విరాళాలు సమకూరాయని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) నివేదిక వెల్లడించింది. ఎన్నికల కమిషన్‌కు రాజకీయ పార్టీలు సమర్పించిన రికార్డులను విశ్లేషించిన మీదట ఈ నివేదికను ఏడీఆర్ రూపొందించింది. మహారాష్ట్రకు చెందిన శివసేన 297 విరాళాల నుంచి రూ 25.65 కోట్లు స్వీకరించింది. ఇక రూ24.73 కోట్ల విరాళాలతో ఆప్ తదుపరి స్ధానంలో నిలించింది.
పంజాబ్‌కు చెందిన శిరోమణి అకాలీ దళ్ రూ 15.45 కోట్ల విరాళాలు రాబట్టి మూడో స్థానంలో నిలిచిందని ఏడీఆర్ నివేదిక తెలిపింది. ఇక ప్రాంతీయ పార్టీలు 6,339 విరాళాల నుంచి మొత్తం రూ 91.37 కోట్ల మొత్తం సమీకరించాయి. ఇందులో రూ 65.83 కోట్లు శివసేన, ఆప్, శిరోమణి అకాలీదళ్‌లకే దక్కాయి. నగదు విరాళాల్లో రూ 72.7 లక్షలతో అసోం ప్రధమ స్ధానంలో నిలవగా,రూ 65 లక్షలతో పుదుచ్చేరి తదుపరి స్ధానంలో ఉంది.
అత్యధిక విరాళాలు రూ 20.86 కోట్లు ఢిల్లీ నుంచి సమకూరగా, 19.7 కోట్లు మహారాష్ట్ర నుంచి రూ 9.42 కోట్లు పంజాబ్ నుంచి సమకూరాయని ఏడీఆర్ నివేదిక తెలిపింది. రాజకీయ పార్టీలు రూ 20,000 మించిన విరాళాల వివరాలను వెల్లడించాలని, ఫామ్ 24ఏని పూర్తిగా నింపాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment