సుమారు ఓ 55 ఏళ్ల వ్యక్తి రోడ్డు దాటుతుండగా.. వేగంగా దూసుకొచ్చిన ఓ వాహనం ఆయనను ఢీకొట్టింది.
తిరువనంతపురం: సుమారు ఓ 55 ఏళ్ల వ్యక్తి రోడ్డు దాటుతుండగా.. వేగంగా దూసుకొచ్చిన ఓ వాహనం ఆయనను ఢీకొట్టింది. నిస్సహాయంగా రోడ్డు మీద పడిపోయి.. నెత్తురోడుతున్న ఆయనను అందరూ చూస్తూ ఉన్నారు కానీ, ఎవరూ స్పందించలేదు. సంఘటన స్థలంలో ఓ పోలీసు కూడా ఉన్నాడు. కానీ దాదాపు అరగంట తర్వాత గాయాలైన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఆదివారం తిరువనంతపురంలో ఈ ఘటన జరిగింది.
ఇస్రో వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయాలపాలై రోడ్డు మీద చాలాసేపు నెత్తురోడుతూ ఉండిపోయారు. ఆయన ఓ సమీపంలో ఓ కానిస్టేబుల్ కూడా ఉన్న వీడియో వెలుగుచూడటం.. ఇప్పుడు కేరళ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. దాదాపు అరగంట వరకు బాధితుడిని ఆస్పత్రికి తీసుకువెళ్లలేదని వార్తలు రాగా.. పోలీసులు ఖండించారు. అంబులెన్సు రావడంతో కొంత ఆలస్యమైనా పన్నెండు నిమిషాల లోపే బాధితుడిని ఆస్పత్రిలో చేర్చామని, అప్పటికే తీవ్రంగా గాయపడటంతో ఆయన ప్రాణాలు విడిచారని పోలీసులు చెప్తున్నారు. మృతుడి వద్ద గుర్తింపుకార్డుగానీ, సెల్‌ఫోన్‌గానీ లేకపోవడంతో ఆయన వివరాలు ఇంకా తెలియరాలేదు.