టర్కీ, పాక్‌ నుంచి విమానంలో ఆయుధాలు! | After Independence, Nizam did not agree to merge the Hyderabad with India | Sakshi
Sakshi News home page

విమానంలో ఆయుధాలు వస్తాయని..

Published Mon, Sep 17 2018 3:14 AM | Last Updated on Mon, Sep 17 2018 10:58 AM

After Independence, Nizam did not agree to merge the Hyderabad with India - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: స్వాతంత్య్రం వచ్చిన తర్వాత హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయడానికి నిజాం ఒప్పుకోలేదు. కానీ నాటి హోం మంత్రి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ సైనిక చర్యతో తలవంచాల్సి వచ్చింది. బ్రిటిష్‌ పాలకులు భారత్‌కు స్వాతంత్య్రం ఇవ్వడానికి నిర్ణయించినప్పుడు దేశంలోని సంస్థానాలకు రెండు ఆప్షన్లు ఇచ్చారు. స్వతంత్రంగా కొనసాగడమా?... భారత్‌లో విలీనమవడమా? తేల్చుకోవాలన్నారు. కశ్మీర్, హైదరాబాద్‌ మినహా అన్ని సంస్థానాలు విలీనమయ్యాయి. ఈ రెండు సంస్థానాలు దేశంలోని ఇతర సంస్థానాలతో పోల్చితే చాలా పెద్దవి. స్వాతంత్రానికి ముందే బ్రిటిష్‌ పాలనలో చెన్నై, ముంబై, కోల్‌కతా, ఢిల్లీ నగరాలు బాగా అభివృద్ధి చెందాయి. కానీ హైదరాబాద్‌ సంస్థానం దాదాపు 200 ఏళ్లు కుతుబ్‌ షాహీ, 224 ఏళ్లు ఆసిఫ్‌ జాహీల పాలనలో ఉంది. అయినా ఇతర నగరాలు, సంస్థానాల కంటే హైదరాబాద్‌ మెరుగ్గానే ఉంది. హైదరాబాద్‌ సంస్థానంలో రోడ్లు, బస్సు, రైలు, విమానయానం కూడా అందుబాటులో ఉన్నాయి. అన్ని రకాల పరిశ్రమలు, కర్మాగారాలు, ఆస్పత్రులు, విశ్వవిద్యాలయాలున్నాయి. సాగు, తాగు నీటి ప్రాజెక్టులు పుష్కలంగా ఉన్నాయి.  

రైతులకు నరకం..
ఏడవ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీ పాలనలో జమిందార్, జాగీర్‌ వ్యవస్థ వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైతులు పండించిన పంటలపై విపరీతంగా పన్నులు వసూళ్లు చేశారు. పంట పండించిన రైతుకే అన్నం లభించేది కాదు. రైతుల జీవితాలు నరకప్రాయంగా ఉండేవి. సంస్థానం విలీనమైతే ఈ వ్యవస్థ పోతుందని తమకు స్వేచ్ఛ లభిస్తుందని రైతులు భావించారు. ఈ క్రమంలోనే దేశానికి 1947, ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చింది. ఈ సమయంలో నిజాం రాజు ఏ నిర్ణయం తీసుకోలేదు. సంప్రదింపుల తరువాత భారత్‌ ప్రభుత్వం, హైదరాబాద్‌ సంస్థానం మధ్య 1947, నవంబర్‌ 29న ఒప్పందం కుదిరింది. ఈ మేరకు హైదరాబాద్‌ సంస్థానం యథాతథంగా కొనసాగాలని నిర్ణయించారు.  

భారత దేశంలో విలీనం...
నాటి హోం మంత్రి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ హైదరాబాద్‌ సంస్థానాన్ని దేశంలో కలపాలని నిర్ణయించాడు. మేజర్‌ జనరల్‌ జేఎన్‌ చౌదరి నేతృత్వంలో సైన్యాన్ని హైదరాబాద్‌ పంపాలని ఆదేశాలిచ్చారు. భారత సైన్యం అన్ని రకాల ఆయుధాలతో బయలుదేరింది. నిజాం తన సంస్థానానికి టర్కీ, పాకిస్తాన్‌ నుంచి మద్దతు లభిస్తుందని భావించాడు. నిజాంకు చెందిన సిడ్నీ కాటన్‌ విమానం ఆ దేశాల నుంచి అత్యాధునిక ఆయుధాలు తీసుకొని వస్తుందని అనుకున్నారు. ఈ రెండూ జరగలేదు. అప్పటికే రజాకార్ల దౌర్జన్యంతో ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, మరోవైపు భారత సైన్యంతో మన సైన్యం పోటీపడలేదని సైన్యాధిపతి అల్‌ ఇద్రూస్‌ నిజాం తెలియజేశారు.

భారత సైన్యం సునాయాసంగా నిజాం సంస్థానంలో ప్రవేశించింది. 1948, సెప్టెంబర్‌ 17న సాయంత్రం ఏడు గంటలకు ఏడవ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ హైదరాబాద్‌ రేడియో ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ నిజాం పాలన ఇంతటితో అంతమైందని, నిజాం సంస్థానం భారత్‌లో విలీనమైందని ప్రకటించారు. ఈ పని ఇది వరకే చేయాల్సిందని, అలా చేయనందుకు విచారిస్తున్నామని ఐక్యరాజ్యసమితిలో పెట్టిన అన్ని కేసులను వెనక్కి తీసుకుంటున్నామని చెప్పారు. అనంతరం హైదరాబాద్‌ సంస్థాన సైన్యాధిపతి అల్‌ ఇద్రూస్‌ భారత సైన్యా«ధిపతి ముందు తన సైన్యంతో సహా లొంగిపొయాడు. మేజర్‌ జనరల్‌ జె.ఎన్‌ చౌదరి హైదరాబాద్‌ సైనిక గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈయన 1949 వరకు కొనసాగారు. అనంతరం 1950 జనవరిలో భారత ప్రభుత్వ సీనియర్‌ అధికారి ఎం.కె. వెల్లోడిని ముఖ్యమంత్రిగా నియమించింది. తర్వాత 1952లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్‌ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. 

రజాకార్లతో .. 
ముస్లిం సముదాయంలోని అన్ని వర్గాలను తమ సమస్యల పరిష్కారానికి ఒకే వేదికపైకి తీసుకురావడానికి 1924లో బహదూర్‌ యార్‌ జంగ్‌ మజ్లీస్‌–ఏ–ఇత్తేహదుల్‌ ముస్లిమీన్‌ సంస్థను స్థాపించారు. 1944లో బహదూర్‌ యార్‌ జంగ్‌ మృతి చెందడంతో మజ్లిస్‌ పగ్గాలు ఖాసీం రజ్వీ చేతికొచ్చాయి. అప్పటికే స్వాతంత్ర ఉద్యమం తారస్థాయికి చేరింది. బ్రిటిష్‌ పాలకులు దేశం విడిచి వెళ్లిపోతున్నట్లు ప్రచారం జరిగింది. హైదరాబాద్‌ సంస్థానం కూడా దేశంలో కలిస్తే మన పరిస్థితి దారుణం అయిపోతుందని ముస్లింలను రజ్వీ రెచ్చగొట్టాడు. రజాకార్‌ (స్వచ్ఛంద) అనే గ్రూప్‌ను తయారు చేసి వారికి కర్ర, ఆయుధాల శిక్షణ ఇచ్చాడు. దేశానికి అనుకూల నినాదాలు చేసిన వారిపై రజాకార్లు దాడులు చేయడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్‌ సంస్థానం భారత్‌లో విలీనం అయిన తరువాత ఖాసీం రజ్వీని జైలులో పెట్టారు. ఆరేళ్ల తర్వాత విడుదలై పాకిస్తాన్‌కు వెళ్లి అక్కడే మరణించాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement