దమ్ మారో దమ్.. మిస్టరీ కహానీ
భారీగా గంజాయిని సేవించిన ఎలుకలు
Published Thu, Aug 24 2017 6:52 PM | Last Updated on Tue, Oct 9 2018 2:23 PM
ధన్‌బాద్: జార‍్ఖండ్‌లో భారీగా పట్టుబడ్డ గంజాయి స్కాంలో పోలీసులపై విమర్శలు వినిపిస్తున్నాయి. గంజాయి పెద్ద మొత్తంలో మాయం కావటం పలు అనుమానాలకు తావిస్తోంది. సుమారు 45 కేజీల గంజాయిని ఎలుకలు తినేశాయంటూ పోలీసులు చెబుతుండటం చర్చనీయాంశంగా మారింది.
గతేడాది మే నెలలో బిహార్ నుంచి పశ్చిమ బెంగాల్ కు పెద్ద మొత్తంలో గంజాయి స్మగ్లింగ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. తన హోండా సిటీ కారులో 145 కేజీల గంజాయిని తీసుకెళ్తున్న శివాజీ కుమార్ అనే వ్యక్తిని ధన్‌బాద్ జీటీ రోడ్ హైవే వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. సీజ్ చేసిన గంజాయిని బర్వద్దా పోలీస్ స్టేషన్‌లోని స్టోర్ రూంలో నిల్వ చేశారు. కేసుకు సంబంధించి జూలై 11, 2016న ఛార్జీషీట్ కూడా దాఖలు చేశారు. ఇక స్వాధీనం చేసుకున్న గంజాయిని కోర్టులో ప్రవేశపెట్టగా, 45 కేజీలు మాయం అవ్వటం జడ్జి గమనించారు. మిగిలిన గంజాయి ఏమైందని ఆయన ప్రశ్నించగా, బర్‌వద్దా స్టేషన్ అధికారి దినేశ్ కుమార్ ఎలుకలు తినేశాయంటూ ఓ నివేదిక సమర్పించాడు. దీంతో ఆశ్చర్యం వ్యక్తం చేసిన న్యాయమూర్తి ఘటన పై సమగ్ర నివేదిక సమర్పించాలంటూ పోలీస్ శాఖను ఆదేశించారు.
గతంలో బిహార్ మద్యపాన నిషేధ సమయంలో 9,00,000 లీటర్ల మద్యం ఎలుకల పాలైందని అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ యేడాది నాగ్‌పూర్‌లో కూడా సరిగ్గా ఇలాగే 25 కేజీల గంజాయి మాయం కాగా, అప్పుడు కూడా ఎలుకల మీదకు నేరం నెట్టేశారు పోలీసులు.
Advertisement
Advertisement