నా జీవితంలో పెద్ద ఆస్తి మీరే: సోనియా
న్యూఢిల్లీ: తొలిసారి ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి గత కొద్ది రోజులుగా దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ బుధవారం ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని ఆమె అందులో ఆరోపించారు. అనంతరం అమేథీ, రాయ్‌బరేలీతో తమ కుటుంబానికి ఉన్న సంబంధాన్ని గుర్తు చేశారు. తాను ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండటానికి గల కారణాలు పెద్దగా పేర్కొనని ఆమె అమేథీ, రాయ్‌బరేలీ తమ జీవితంలో భాగం అని చెప్పారు.
ఉత్తరప్రదేశ్‌లో నాలుగో దశ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమె లేఖ విడుదల చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ దశలోనే ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న రాయ్‌బరేలీకి చెందిన ఐదు నియోజవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎప్పటిలాగే ఈ ప్రాంత ప్రజలు తమతో ఉండాలని సోనియా లేఖలో విజ్ఞప్తి చేశారు. ‘కొన్నికారణాల వల్ల ఈసారి నేను మీముందుకు రాలేకపోతున్నాను. మీకు ప్రతినిధిగా ఉండటం నాకు, నా కుటుంబానికి చాలా గౌరవం. మీతో మా కుటుంబానిది ప్రత్యేక అనుబంధం. నా జీవితంలో అతిపెద్ద ఆస్తులు మీరే’ అంటూ సోనియా ఆ లేఖలో పేర్కొన్నారు.