సీనియర్ కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ (ఫైల్‌ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : తన రాజ్యసభ ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను తోసిపుచ్చాలని గుజరాత్ హైకోర్టును ఆదేశించాలని కోరుతూ సీనియర్ కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ సోమవారం సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం కన్విల్కార్, డీవై చంద్రచూడ్‌తో కూడిన బెంచ్ అహ్మద్ పటేల్ అప్పీల్‌ను విచారించనుంది. కాగా గుజరాత్ నుంచి రాజ్యసభకు అహ్మద్ పటేల్ ఎన్నికను సవాల్ చేస్తూ బీజేపీ అభ్యర్థి బల్వంత్‌సింహ్ రాజ్‌పుట్ గుజరాత్ హైకోర్టులో జులై 9న పిటిషన్‌ను దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం మేరకు ఇద్దరు రెబెల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఓట్లు చెల్లుబాటు కావన్న ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని రాజ్‌పుట్ తన పిటిషన్‌లో ప్రశ్నించారు.
అహ్మద్‌పటేల్ 44 మంది ఎమ్మెల్యేలను బెంగళూర్‌లోని రిసార్ట్‌లో అక్రమంగా తన ఆధీనంలో ఉంచుకోవడం ద్వారా అవినీతి విధానాలను ఆశ్రయించారని ఆయన ఆరోపించారు. అయితే రాజ్‌పుట్ పిటిషన్ విచారణార్హమైనదని కాదంటూ దాన్ని కొట్టివేయాల్సిందిగా గుజరాత్ హైకోర్టుకు ఆదేశాలు ఇవ్వాలని అహ్మద్ పటేల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. రాజ్యసభ ఎన్నికల్లో అహ్మద్ పటేల్ ఐదవ సారి గెలుపొంది పెద్దల సభకు ఎన్నికయ్యారు.
తమ ఎమ్మెల్యేలు ఇద్దరు బహో గొహిల్, రాఘవ్ భాయ్‌లు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడటమే కాకుండా, తమ బ్యాలెట్ పత్రాలను బీజేపీ చీఫ్ అమిత్ షాకు చూపారని కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేయడంతో వీరి ఓట్లు చెల్లవని ఈసీ స్పష్టం చేయడంతో అహ్మద్ పటేల్ గెలుపు మరింత సులువైంది.
Comments
Please login to add a commentAdd a comment