
చిన్నమ్మకే పట్టం
అన్నాడీఎంకేలో అంతా ఊహించినట్టుగానే జరిగింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ నటరాజన్ ఎన్నికయ్యారు.
చెన్నై: అన్నాడీఎంకేలో అంతా ఊహించినట్టుగానే జరిగింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ నటరాజన్ ఎన్నికయ్యారు. గురువారమిక్కడ ప్రారంభమైన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. శశికళ నాయకత్వంలో పనిచేయాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నికైనట్టు అన్నాడీఎంకే పార్టీ వెబ్ సైట్ లో అధికారికంగా ప్రకటించారు. శశికళను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు సమావేశం ముగిసిన తర్వాత సీఎం పన్నీరు సెల్వం ప్రకటించారు. జనవరి 2న అధికారికంగా శశికళ పార్టీ పగ్గాలు చేపడతారని సమాచారం.
పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న మధసూదన్ నాయకత్వంలో అన్నాడీఎంకే నేతలు సమావేశమయ్యారు. ముందుగా దివంగత నాయకురాలు జయలలితకు నివాళి అర్పించారు. సమావేశంలో 14 తీర్మానాలు ఆమోదించారు. జయలలిత పుట్టినరోజును జాతీయ రైతుల దినోత్సవంగా ప్రకటించాలని, అమ్మకు భారతరత్న ఇవ్వాలని కూడా తీర్మానాలు ఆమోదించారు. అంతేకాదు మెగసెసె అవార్డు, నోబెల్ శాంతి పురస్కారానికి జయలలిత పేరును ప్రతిపాదించాలని కోరుతూ అన్నాడీఎంకే నేతలు తీర్మానించారు.