న్యూఢిల్లీ : భారత్- పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కార్గిల్ యుద్ధ హీరో ఎయిర్ మార్షల్ రఘునాథ్ నంబియార్‌ను.. ఐఏఎఫ్ వెస్ట్రన్ ఎయిర్ కమాండ్(డబ్ల్యూఏసీ) చీఫ్‌గా నియమించింది. ఇన్నాళ్లుగా ఈస్ట్రన్ ఎయిర్ కమాండ్ చీఫ్‌గా పనిచేసిన నంబియార్ శుక్రవారం నుంచి పశ్చిమ వాయుదళంలో కీలక బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కాగా భారత వైమానిక దళంలోని దాదాపు 40 ఎయిర్‌బేస్‌లు డబ్ల్యూఏసీ నియంత్రణలోనే ఉంటాయి. తద్వారా రాజస్తాన్‌లోని బికనీర్ నుంచి సియాచిన్ గ్లేసియర్ వరకు గల గగనతలాన్ని డబ్ల్యూఏసీ నిరంతరం పర్యవేక్షిస్తుంది.
ఇక కార్గిల్ యుద్ధ సమయంలో పాకిస్తాన్ సైనిక స్థావరాలపై తన విమానం ద్వారా ఐదు లేసర్ గైడెడ్ బాంబులను విసిరిన నంబియార్.. భారత్ గెలుపులో ప్రముఖ పాత్ర పోషించారు. అంతేకాకుండా ఎయిర్ మార్షల్‌గా మిరాజ్-2000లో సుమారు 2300 గంటల పాటు ప్రయాణించిన ఘనత ఆయన సొంతం. అదేవిధంగా ఐఏఎఫ్ నంబర్ స్క్వాడ్రాన్‌కు నంబియార్ నేతృత్వం వహించారు. మిరాజ్‌తో పాటు తొలి రాఫెల్ ఫైటర్ జెట్‌ను కూడా నడిపిన ఆయన సీనియర్ టెస్టు పైలట్, కమాండింగ్ ఆఫీసర్‌గా కీర్తి గడించారు. లైట్ కమంబాట్ ఎయిర్‌క్రాఫ్టులను పరీక్షించినందుకు గానూ 2002లో వాయుసేన మెడల్ పొందారు.
Comments
Please login to add a commentAdd a comment