
మళ్లీ అఖిలేశ్ వర్గం రచ్చ షురూ
సమాజ్వాది పార్టీలో అసంతృప్తి మరోసారి పెల్లుబుకుతోంది.
లక్నో: సమాజ్వాది పార్టీలో అసంతృప్తి మరోసారి పెల్లుబుకుతోంది. ఓపక్క తమలో ఎలాంటి విభేదాలు లేవని, తామంతా ఒకటే అని సమాజ్వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ప్రకటన చేయగా వెంటనే శివపాల్ యాదవ్ను పార్టీ పగ్గాల నుంచి తప్పించి వాటిని ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్కే అప్పగించాలని పలువురు అఖిలేశ్ మద్దతుదారులు, యువకులు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు.
ఏకంగా పార్టీ కార్యాలయాన్ని చుట్టుముట్టి గట్టిగా నినాదాలు చేశారు. ఎర్రటి టోపీలు, అఖిలేశ్ ముఖచిత్రంతో ముద్రించిన టీ షర్ట్లు ధరించి పార్టీ కార్యాలయం గోడలు, అక్కడి చెట్లపైకి ఎక్కి అఖిలేశ్ మద్దతుగా అరిచారు. పార్టీ భవిష్యత్ అంతా ములాయం సింగ్ 43 ఏళ్ల కుమారుడి చేతిలోనే ఉంటుందని వారన్నారు. అక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటుచేసినప్పటికీ వారిని నియంత్రించడంలో పోలీసులు విఫలమయ్యారు. వీఐపీల వాహనాలు పార్క్ చేసే స్థలం వరకు దూసుకెళ్లారు.