అఖిలేశ్‌కే ‘సైకిల్‌’ | Akhilesh Yadav gets cycle: CM snatches Samajwadi Party symbol, name from father Mulayam Singh | Sakshi
Sakshi News home page

అఖిలేశ్‌కే ‘సైకిల్‌’

Published Tue, Jan 17 2017 2:22 AM | Last Updated on Tue, Sep 5 2017 1:21 AM

అఖిలేశ్‌కే ‘సైకిల్‌’

అఖిలేశ్‌కే ‘సైకిల్‌’

సమాజ్‌వాదీ పేరు, సైకిల్‌ గుర్తు సీఎం వర్గానికే కేటాయిస్తూ ఈసీ నిర్ణయం
ములాయంకు భంగపాటు
సరైన నిర్ణయం, త్వరలో పొత్తు అవకాశం: రాంగోపాల్‌
అఖిలేశ్‌ ముస్లిం వ్యతిరేకి.. తీరు మార్చుకోకుంటే కొడుకుపై పోటీకి సిద్ధం: ములాయం


న్యూఢిల్లీ, లక్నో: సమాజ్‌వాదీ పార్టీలో తండ్రీ కొడుకుల సమరంలో చివరికి తనయుడే పైచేయి సాధించాడు. సమాజ్‌వాదీ పార్టీ పేరు, గుర్తు కోసం ములాయంసింగ్, అఖిలేశ్‌ల మధ్య సాగుతున్న పోరుకు సోమవారం రాత్రి కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ముగింపు పలికింది. అఖిలేశ్‌ వర్గానికే సైకిల్‌ గుర్తు, పార్టీ పేరును ఖరారు చేస్తూ సీఈసీ కీలక నిర్ణయం తీసుకోవడంతో ములాయం వర్గానికి భంగపాటు ఎదురైంది. ఎన్నికల సంఘం తీర్పు వెలువడిన వెంట నే తండ్రి  ఆశీర్వాదం కోసం సీఎంఅఖిలేశ్‌.. ములాయం ఇంటికి వెళ్లగా, ఈ పోరు ఇంతటితో ఆగదని ఈసీ నిర్ణయంపై కోర్టును ఆశ్రయిస్తానంటూ ములాయం స్పష్టం చేశారు.

తమకే పార్టీ గుర్తు, పేరు చెందాలంటూ ములాయం, అఖిలేశ్‌ వర్గాలు ఈసీ ముందు పంచాయితీ పెట్టడంతో నిర్ణయంపై కొద్ది రోజులుగా ఉత్కంఠ నెలకొంది. సైకిల్‌ గుర్తు ఇరు వర్గాలకు కేటాయించకుండా చెరో కొత్త గుర్తును కేటాయిస్తారంటూ ప్రచారంసాగింది. జనవరి 17 నుంచి ఉత్తరప్రదేశ్‌ మొదటివిడత ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండడంతో సోమవారం ఏదొ ఒక నిర్ణయం రావచ్చని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ నదీం జైదీ నేతృత్వంలోసోమవారం సమావేశమైన ఈసీ బృందం... అఖిలేశ్‌ వర్గానికి సమాజ్‌వాదీ పేరును వాడుకునేందుకు అనుమతించడంతో పాటు, సైకిల్‌ గుర్తును రిజర్వ్‌ చేస్తూ తీర్పునిచ్చింది.

అఖిలేశ్‌దే అసలైన సమాజ్‌వాదీ: ఈసీ
‘అఖిలేశ్‌ నేతృత్వంలోని గ్రూపును సమాజ్‌వాదీ పార్టీగా గుర్తిస్తున్నాం. పార్టీ పేరును వాడుకునేందుకు అఖిలేశ్‌ వర్గానికే అర్హత ఉంది. ఎన్నికల గుర్తుగా వాడుకునేందుకు సైకిల్‌ గుర్తును రిజర్వ్‌ చేస్తున్నాం’ అంటూ ఎన్నికల సంఘం తన ఉత్తర్వుల్లోపేర్కొంది.  అఖిలేశ్‌ వర్గం 228 మంది ఎమ్మెల్యేలకు గాను 205 మంది అఫిడవిట్లు, 68 మంది ఎమ్మెల్సీలకు 56, 24 మంది ఎంపీలకుగాను 15, 46 మంది జాతీయ కార్యవర్గ సభ్యులకుగాను 28 మంది, 5,731 జాతీయ కన్వెన్షన్‌ ప్రతినిధులకు గాను4,400 మంది అఫిడవిట్లు సమర్పించినట్లు ఈసీ తెలిపింది.

ములాయం వైపు నుంచి ఎలాంటి అఫిడవిట్లు రాలేదంది.అఖిలేశ్‌ నివాసం వద్ద సంబరాలుఈసీ తీర్పుపై పార్టీ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్‌యాదవ్‌ స్పందిస్తూ... ‘పార్టీ గుర్తు, పేరును దక్కించుకునేందుకు ములాయం వర్గం వద్ద ఎలాంటి సరైన ఆధారాలు లేవు. ఈ నిర్ణయంతో ముఖ్యమంత్రి చాలా సంతోషంగా ఉన్నారు’ అని చెప్పారు.యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు అవకాశాలపై స్పందిస్తూ.. పార్టీ అధ్యక్షుడు ఆ విషయాన్ని నిర్ణయిస్తారని, త్వరలో పొత్తు కుదరవచ్చంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. తీర్పు అనంతరం లక్నోలోని 5– కాళిదాస్‌ మార్గ్‌లో ఉన్న సీఎం నివాసం వద్దకార్యకర్తలు, నేతలు సంబరాలు చేసుకున్నారు. వందలాది మంది మద్దతుదారులు అఖిలేశ్‌ నివాసానికి చేరుకుని బాణసంచా పేలుస్తూ.. నృత్యాలు చేశారు. మరోవైపు, ములాయం వర్గం మాత్రం ఎటూ తేల్చుకోలేక సందిగ్ధంలో పడింది.

                  
                            సోమవారం ములాయంను కలిశాక అఖిలేశ్‌ తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసిన ఫొటో
మొదటి నుంచి పోటాపోటీగా...
జనవరి 1న అఖిలేశ్‌ను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నియమిస్తూ లక్నోలో నిర్వహించిన జాతీయ సమావేశం నిర్ణయం తీసుకుంది. ములాయం సోదరుడు శివపాల్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా నుంచి తొలగించడంతోపాటు అమర్‌సింగ్‌ను పార్టీ నుంచిబహిష్కరించారు. దీటుగా స్పందించిన ములాయం.. తానే ఎస్పీ జాతీయాధ్యక్షుడినంటూ..రాంగోపాల్‌ యాదవ్‌ను బహిష్కరిస్తున్నట్లుగా ప్రకటించారు.

అఖిలేశ్‌ కీలుబొమ్మ: ములాయంముస్లిం ఓటు బ్యాంకు చేజారకుండా ఉండేందుకు కొడుకు అఖిలేశ్‌పై ములాయంసింగ్‌యాదవ్‌ సంచలన ఆరోపణలు చేశారు. ముస్లింల పట్ల అఖిలేశ్‌కు వ్యతిరేక అభిప్రాయం ఉందని, ఆ ధోరణి మార్చుకోకపోతే... తన కొడుకుపై పోటీ చేస్తానని చెప్పిపార్టీ కార్యకర్తల్ని ఒక్కసారిగా షాక్‌కు గురిచేశారు. లక్నోలోని సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తల్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తిని రాష్ట్రానికి డీజీపీగా నియమించాలని చెప్పడంతో అఖిలేశ్‌ 15 రోజులునాతో మాట్లాడలేదు. డీజీపీ పదవిని ముస్లిం చేపట్టడం అతనికి ఇష్టం లేదు. రాంగోపాల్‌ యాదవ్‌ చేతుల్లో కీలుబొమ్మగా మారిపోయాడు.

రాంగోపాల్‌ బీజేపీ ఆదేశాల మేరకు పనిచేస్తున్నాడు. నేను ముస్లింల కోసమే బతుకుతా.. వారి కోసమేమరణిస్తా. ముస్లిం ప్రయోజనాల కోసం కొడుకుతో పోరుకైనా సిద్ధం’ అని ములాయం అన్నారు. పార్టీ దాదాపుగా చీలిపోయిందని అంగీకరిస్తూ... చీలికను అడ్డుకోవడంతో తాను నిస్సహాయుడినని చెప్పారు. సైకిల్‌ గుర్తు, పార్టీ పేరు కేటాయింపులో ఈసీతనకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే కోర్టును ఆశ్రయిస్తానన్నారు. ‘పార్టీ అభివృద్ధికి నేను ఎన్నో త్యాగాలు చేశాను. అఖిలేశ్‌ నా మాట వినకుండా అనేక మంది మంత్రుల్ని తొలగించాడు. కారణాల్లేకుండా సీనియర్‌ మంత్రుల్ని తప్పించాడు.రాంగోపాల్‌ చేతుల్లో పావుగా మారి నా కొడుకు తిరుగుబాటు చేస్తే నేనేం చేయగలను’ అంటూ ఉద్వేగంగా ప్రసంగించారు. అఖిలేశ్‌ తనకు వ్యతిరేకంగా మారాడని, ఇలా చేస్తాడని ఊహించలేదన్నారు.

మహాకూటమి ఏర్పాటుకు యత్నాలు
బీజేపీ అధికారంలోకి రాకుండా కాంగ్రెస్‌తో కలసి మహా కూటమి ఏర్పాటుకు అఖి లేశ్‌ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎన్నికల గుర్తుపై అడ్డంకులు తొలగిపోవడంతో కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్‌దళ్, ఎన్సీపీలతో పొత్తును రెండు, మూడు రోజుల్లో ఖరారుచేసేందుకు అఖిలేశ్‌ వర్గం ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో అఖిలేశ్‌ చర్చలు జరపనున్నట్లు సమాచారం. 100 సీట్లలో పోటీకి కాంగ్రెస్‌ పట్టుబడుతుండగా, రాష్ట్రీయ లోక్‌దళ్‌కు 25–30 సీట్లు కేటాయించాలని ఎస్పీ అవగాహనకువచ్చినట్లు తెలుస్తోంది. ఎన్సీపీ 25 సీట్లను డిమాండ్‌ చేయవచ్చని భావిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement